‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగంగా వస్తోన్న ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలువబోతోంది. ఈ కన్నడ చిత్రం ఏ తీరున అలరిస్తుందో కానీ, ఓ రికార్డ్ ను మాత్రం పక్కాగా సొంతం చేసుకుంటోంది! ‘కేజీఎఫ్ – 2’కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను అత్యంత భారీవ్యయంతో నిర్మించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నిర్మితమైన ‘కేజీఎఫ్’ సినిమా అందరినీ అలరించింది. అదే తీరున ఈ సినిమా రెండో భాగం కూడా మురిపించనుందని సినీఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ‘ఐ మ్యాక్స్’ ఫార్మాట్ లోనూ రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఐ మ్యాక్స్’ ఫార్మాట్ లో విడుదలవుతున్న తొలి కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ నిలవనుంది. ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరగండూర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో మొత్తం 1500 ఐమ్యాక్స్ థియేటర్లు ఉన్నాయి. అందులో మన దేశానికి చెందినవి 22, వాటిలో అతి పెద్ద స్క్రీన్ గా ఉన్నది హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్. మన దేశంలోని ఐమ్యాక్స్ థియేటర్లలో కనీసం 15 స్క్రీన్స్ లో ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ప్రదర్శితం కావడానికి ఇప్పటికే సీన్ సిద్ధమయింది. తెలుగులోనూ విడుదలవుతోన్న ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లోనూ ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. మరి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఐమ్యాక్స్ థియేటర్లలో ‘కేజీఎఫ్ -2’ సందడి చేస్తుందో? భారీ అంచనాలతో , బిజినెస్ పరంగానూ కన్నడ నాట సరికొత్త చరిత్ర సృష్టిస్తోన్న ‘కేజీఎఫ్-2’ ఐ మ్యాక్స్ స్క్రీన్ పై ఎంతలా అలరిస్తుందో చూడాలి.