Keerthy Suresh Is Getting Married: హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో వచ్చే గాసిప్‌లు అన్నీ ఇన్నీ కావు. అక్కడ పెళ్లి విషయం ఇంకా కన్ఫమ్ అయ్యుండదు, ఇక్కడ మీడియా మాత్రం అప్పుడే బాజాలు మోగించేస్తోంది. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సికపై అలాంటి వార్తలే హల్‌చల్ చేశాయి. ఆమె పెళ్లి ఖరారైందని జోరుగా ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని హన్సిక చెప్పేదాకా వార్తలు ఆగలేదు. నిత్యామీనన్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా కీర్తి సురేశ్ మీద పెళ్లి వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
కోలీవుడ్ మీడియా ప్రకారం.. కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోయే వరుడు ఓ వ్యాపారవేత్త. రాజకీయాల్లోనూ అతడు చురుగ్గా పాల్గొంటున్నాడట! తల్లిదండ్రులు ఈ వరుడ్ని సెలెక్ట్ చేశారని, కీర్తి కూడా దాదాపు ఓకే చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే మాత్రం.. కీర్తి సురేశ్ ఇంట త్వరలోనే మంగళ వాయిద్యాలు మోగడం ఖాయం. గతంలోనూ ఓసారి కీర్తి పెళ్లిపై ఇలాంటి ప్రచారమే జరిగింది. వరుస ఫ్లాపుల్లో వస్తుండటంతో, సినిమాల్ని పక్కన పెట్టేసి, పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని నిర్ణయించుకున్నట్టు టాక్ నడిచింది. ఇండస్ట్రీకి చెందినవాడితోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెగ రూమర్లొచ్చాయి. తీరా చూస్తే, అవన్నీ అబద్ధాలేనని తేలాయి. మరి, ఈసారి వస్తోన్న వార్తలు నిజమో, అబద్ధమో చూడాలి మరి!
కాగా.. మహానటి తర్వాత వరుస ఫ్లాపులు చవిచూసిన కీర్తి సురేశ్, రీసెంట్‌గా మహేశ్ బాబు సరసన నటించిన ‘సర్కారు వారి పాట’తో హిట్ అందుకుంది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో కీర్తి మరిన్ని సినిమాలకు సంతకం చేస్తోంది. ఆల్రెడీ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటిస్తోంది. దీనికితోడు.. హిందీలో మంచి విజయం సాధించిన ‘మీమీ’ తెలుగు, తమిళ రీమేక్‌లో ప్రధాన పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి.