Keanu Reeves: ఒకటైపోయింది.. మరోదానిపై ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ మాటలు అంటున్నది హాలీవుడ్ నటుడు కీనూ రీవ్స్ గురించి. ఒకప్పుడు కీనూ రీవ్స్ పేరు వినగానే ఆయన నటించిన ‘మ్యాట్రిక్స్’ సిరీస్, ‘జాన్ విక్’ ఫ్రాంచైజ్ గుర్తుకు రాకమానవు. కీనూ నటించిన ‘ద మ్యాట్రిక్స్’, ‘ద మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ద మ్యాట్రిక్స్ రివల్యూషన్స్’ చిత్రాలు భారీ విజయాలను నమోదు చేశాయి. కానీ, ఆ సినిమాలకు సీక్వెల్ గా రూపొందిన ‘ద మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ 2021లో జనం ముందు నిలచి పరాజయం పాలయింది. దీంతో కీనూ రీవ్స్ తనకు ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘ద మ్యాట్రిక్స్’ సిరీస్ లోని నియో పాత్ర కంటే ‘జాన్ విక్’ ఫ్రాంచైజీలోని జాన్ విక్ పై మనసు పారేసుకున్నాడట!
కీనూ రీవ్స్ తొలిసారి 2014లో ‘జాన్ విక్’లో టైటిల్ రోల్ పోషించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. 2017లో జనం ముందు నిలచిన ‘జాన్ విక్ – చాప్టర్ 2’ కూడా ఘనవిజయాన్ని అందుకుంది. 2019లో వెలుగు చూసిన ‘జాన్ విక్ – చాప్టర్ 3’ మరింత విజయం చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో జాన్ విక్ చాప్టర్ ఫోర్ గా వస్తోన్న ‘జె.డబ్ల్యూ. 4’లోనూ కీనూ టైటిల్ రోల్ పోషించాడు. ఈ సినిమా 2023 మార్చి 24న ప్రేక్షకులను పలకరించనుంది. రాబోయే ‘జాన్ విక్ – చాప్టర్ 4’పై కీనూకు ఎలాంటి నమ్మకముందో కానీ, ఈ సినిమా విడుదల కాకుండానే నటి అనా డి అర్మాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘బేలరినా’లో మరోమారు జాన్ విక్ గా నటించడానికి సిద్ధమయ్యాడు కీనూ. అంతేకాదు ఈ చిత్ర నిర్మాణంలోనూ కీనూ పాలు పంచుకుంటూ ఉండడం విశేషం!
‘జాన్ విక్’ ఫ్రాంచైజీలో హీరోది ప్రధాన పాత్ర కాగా, ఈ ‘బేలరినా’లో హీరోయిన్ దే మెయిన్ రోల్. తన కుటుంబాన్ని అంతం చేసిన వారిపై పగతీర్చుకొనే కథతో ఈ ‘బేలరినా’ రూపొందుతోంది. జాన్ విక్ ఫ్రాంచైజీలో ఇప్పటి దాకా వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. రాబోయే చాప్టర్ ఫోర్ కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. అయితే అందులోని ప్రధాన పాత్ర జాన్ విక్ ‘బేలరినా’ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోవడం ఇప్పుడు విశేషంగా మారింది. మరి ఈ కథపై కీనూ రీవ్స్ కు ఎందుకంత నమ్మకం కుదిరిందో సినిమా చూస్తే కానీ తెలియదు. ఈ ‘బేలరినా’ కంటే ముందే ‘జాన్ విక్ – చాప్టర్ 4’ జనాన్ని పలకరిస్తుంది. మరి ఆ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.