ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన కథక్ డ్యాన్సర్ మాత్రమే కాదు శాస్త్రీయ గాయకుడు కూడా. బిర్జూ మహారాజ్ మరణాన్ని మొదట ఆయన మనవడు స్వరణ్ష్ మిశ్రా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. ‘ఈ రోజు మా అత్యంత ప్రియమైన కుటుంబ సభ్యుడు పండిట్ బిర్జూ జీ మహారాజ్‌ను కోల్పోయామని బాధతో తెలియజేస్తున్నాం. జనవరి 17న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి” అంటూ పోస్ట్ చేశారు.
Read Also : పవన్ సినిమాకు దేవి శ్రీ షాకింగ్ రెమ్యూనరేషన్ ?
లక్నోలోని కథక్ కుటుంబంలో 1938 ఫిబ్రవరి 4న జన్మించిన బిర్జూ మహారాజ్ తండ్రి పేరు అచ్చన్ మహారాజ్, అతని మేనమామ పేరు శంభు మహారాజ్. దేశంలోని ప్రసిద్ధ కళాకారులలో ఈ ఇద్దరిదీ ప్రత్యేక స్థానం. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత బిర్జూ మహారాజ్ భుజస్కంధాలపై పడింది. అయినప్పటికీ ఆయన తన మామ నుండి కథక్ నృత్య శిక్షణ తీసుకుని మంచి పేరును సంపాదించుకున్నారు.
దేవదాస్, దేద్ ఇష్కియా, ఉమ్రావ్ జా, బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. అంతేకాకుండా సత్యజిత్ రే చిత్రం ‘చెస్ కే ఖిలాడీ’కి కూడా సంగీతం అందించాడు. ‘విశ్వరూపం’ చిత్రంలో ఆయన నృత్యానికి 2012లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 2016 సంవత్సరంలో ‘బాజీరావ్ మస్తానీ’లోని ‘మోహే రంగ్ దో లాల్’ పాట కొరియోగ్రఫీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. తన ప్రతిభతో తరాలను ప్రభావితం చేసిన బిర్జూ మహారాజ్ మరణం తీరని లోటు అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.