Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ పై చెప్పుదాడి సంఘటన ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శన్ సినిమా క్రాంతి పాట విడుదల కార్యక్రమంలో భాగంగా హోస్ పేటలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో దర్శన్ పై ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే విసిరినా వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్ అని, పునీత్ పై దర్శన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం నచ్చని అతను దర్శన్ ఫై చెప్పు విసిరాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని పునీత్ అన్న శివ రాజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ఘటనపై కన్నడ స్టార్ హీరోలు అందరు స్పందించారు. ఈ ఘటన కన్నడ ఇండస్ట్రీకి సిగ్గుచేటు అని, కన్నడ ఇండస్ట్రీ గురించి మిగతా ఇండస్ట్రీ వారు తప్పుగా అనుకొనే ప్రమాదం ఉందని దయచేసి ఇలాంటి ఘటనలను ఆపాలని చెప్పుకొచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ వివాదంపై హీరో దర్శన్ నోరు విప్పాడు.
సోషల్ మీడియా ద్వారా దర్శన్ మాట్లాడుతూ.. “ఈ సమయంలో ఈ వివాదంపై నాకంటే నా సహ నటీనటులే ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. ఇంకా మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు చూశాం. న్యాయం కోసం నిలుచున్న స్నేహితులు, నటీనటులకు ధన్యవాదాలు. నా సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకు కృతజ్ఞతలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రెటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను”అని చెప్పుకొచ్చాడు. ప్రస్తం దర్శన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.