బాలీవుడ్ ‘ఫైర్ బ్రాండ్’ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు, తాజాగా ఆమె ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో రెహమాన్ వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెహమాన్‌ను ఉద్దేశించి కంగనా ఘాటు విమర్శలు చేశారు. “గౌరవనీయులైన ఏఆర్ రెహమాన్ జీ.. నేను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నాననే కారణంతో చిత్ర పరిశ్రమలో ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నాను కానీ మీకంటే ఎక్కువ పక్షపాతం చూపే, ద్వేషపూరితమైన వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు” అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. తన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎమర్జెన్సీ’ గురించి రెహమాన్‌కు వివరించాలని తాను ఎంతగానో ప్రయత్నించానని, కానీ ఆయన కనీసం తనను కలవడానికి కూడా ఇష్టపడలేదని కంగనా వెల్లడించారు. “కథ వినడం పక్కన పెడితే, మీరు అసలు నన్ను కలవడానికి కూడా నిరాకరించారు, అది ఒక ‘ప్రొపగాండా’ సినిమా అని, అందుకే మీరు అందులో భాగం కావడానికి ఇష్టపడలేదని నాకు తెలిసింది” అని ఆమె పేర్కొన్నారు.
Also Read :Mahesh Babu : సెట్లో మహేష్ బాబు చిలిపి పని.. నిర్మాతకు ఒకటే ‘మ్యూజిక్కు’
తన సినిమాపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ‘ఎమర్జెన్సీ’ ఒక అద్భుతమైన కళాఖండమని, విపక్ష నాయకులు సైతం సినిమాలోని సమతుల్యతను, మానవీయ కోణాన్ని మెచ్చుకున్నారని కంగనా గుర్తు చేశారు. కేవలం రెహమాన్ మాత్రమే ద్వేషంతో గుడ్డివాడైపోయారని ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రెహమాన్ లాంటి నిశ్శబ్ద స్వభావిపై కంగనా ఈ స్థాయిలో విరుచుకుపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై రెహమాన్ స్పందిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.