Kangana Ranaut Comments On Brahmastra Box Office Collections: సందర్భం రావాలే గానీ.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహర్‌ని విమర్శించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కంగనా రనౌత్. అతని వల్లే ఇండస్ట్రీ మొత్తం భ్రష్టు పట్టిపోయిందని, బ్యాక్‌గ్రౌండ్ లేని వారికి అవకాశాలు రావడం లేదన్నది కంగనా ఆరోపణ. సినీ పరిశ్రమని తన గుప్పెట్లో పెట్టుకొని, మాఫియాలా నడుపుతున్నాడంటూ కంగనా నిత్యం ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా కలెక్షన్లు ఫేక్ అంటూ.. మరోసారి ధ్వజమెత్తింది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహర్ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి, తన మాటలను పదును పెట్టింది. విడుదలైన రోజే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవుతుందని తేల్చేసిన కంగనా.. ఇది కచ్ఛితంగా రూ. 800 కోట్ల నష్టాల్ని మిగిలిస్తుందని అంచనా వేసింది. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలపై వేలెత్తి చూపుతోంది.
ఇప్పటివరకూ ఈ సినిమా రూ. 144 కోట్ల నెట్, రూ. 246 కోట్ల గ్రాస్ రాబట్టిందని.. బ్రేకీవన్కి చేరాలంటే ఓవరాల్‌గా రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ఓ ప్రముఖ వెబ్సైట్ బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి పేర్కొంది. ఈ చిట్టాని షేర్ చేస్తూ.. ‘‘ఇది కేవలం రూ. 144 కోట్లు (నెట్) మాత్రమే కలెక్ట్ చేస్తే, తమ సినిమా పెద్ద హిట్ అని వాళ్లు ప్రచారం చేసుకుంటున్నారు. సినిమా మాఫియా ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. కలెక్షన్లు లేదా రికవరీలతో ఏమాత్రం సంబంధం లేకుండా.. ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫ్లాప్ అవుతుందో మాఫియా పెద్దలే నిర్ణయించేస్తున్నారు. ఎవరిని హైప్ చేయాలో, ఎవరిని బహిష్కరించాలో వాళ్లే ఎంచుకుంటారు. ఇప్పుడు వాళ్ల అసలు రంగు బయటపడింది’’ అంటూ కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చింది. దీంతో, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో, అటు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అంతకుముందు బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీపై కూడా కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయాన్‌ను మేధావి పిలిచిన ప్రతి ఒక్కరిని వెంటనే జైల్లో పెట్టాలని పిలుపునిచ్చింది. ఎందుకంటే.. అతడికి ఈ సినిమాని రూపొందించడానికి 12 సంవత్సరాలు పట్టిందని, రూ. 600 కోట్లను బూడిదలో పోశాడని చెప్పుకొచ్చింది. బాహుబలి విజయం స్ఫూర్తితో చివరి నిమిషంలో ఈ సినిమా పేరుని ‘జలాలుద్దీన్ రూమీ’ శివగా మార్చారని.. అలా మార్చి మతపరమైన మనోభావాలను దోపిడీ చేయడానికి ప్రయత్నించారని విమర్శించింది. ‘అలాంటి అవకాశవాదుల్ని, సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తుల్ని మేధావులు అని పిలిచినంత మాత్రాన ఫలితం మారదు.. అదొక ఫ్లాప్’ అంటూ కంగనా వ్యాఖ్యానించింది.