“తల్లి చేనులో మేస్తే… పిల్ల గట్టున మేస్తుందా?”, “యథా మాతా… తథా పుత్రిక…” ఇలాంటి మాటలు బోలెడు విని ఉంటాం. వీటిని కొందరు నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తే, మరికొందరు వీటిలోని పాజిటివ్ నెస్ ను చూస్తూంటారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలనే తనకు అన్వయించుకుంటోంది కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఇటీవల తన తల్లితో తాను ఉన్న ఫోటోపై కంగనా ఓ కామెంట్ పెట్టింది. అది నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. అందులో ఓ అభిమాని, “కంగనా రనౌత్ కోట్లు సంపాదించినా, ఆమె త్లల్లి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు… హౌ గ్రేట్…” అంటూ ట్వీట్ చేశాడు. తన తల్లి లక్షణాలే తనకూ వచ్చాయని, అందుకు తాను ఎంతో గర్వపడతానని కంగనా చెప్పుకుంది. అయితే తాను గర్వంగా చెప్పుకొనే విషయాలను బాలీవుడ్ మాఫియా వక్రీకరిస్తూ ఉంటుందని, తన మాటలను చూసి తనకు తల పొగరు అనీ అనుకుంటూ ఉంటారని కంగనా అంటోంది. నిజానికి కష్టపడి పనిచేసే తత్వం తన తల్లి నుండే తనకు అలవడిందనీ, తనలాంటి వారిని విమర్శించేవారు ఈ విషయం తెలుసుకోవాలనీ కంగనా కోరింది.
తాను సినిమా రంగంలో అడుగు పెట్టిన తొలి రోజుల్లో చెప్పినట్టు వినకుంటే జైలుకు పంపిస్తామనీ కొందరు భయపెట్టినట్టు గుర్తు చేసుకుంటోంది కంగనా. కొందరు హీరోలు పడక గదిలోకి రమ్మంటే తాను తిరస్కరించాననీ, దాంతోనూ తనపై పలు పుకార్లు లేవదీశారని చెబుతోంది. ఐటమ్ నంబర్స్ చేస్తూ, హీరోల అడుగలకు మడుగులు వత్తేవారిని కంగనా విమర్శించింది. తాను ఐటమ్ నంబర్స్ చేయలేదని, వారు చెప్పినట్టు వినలేదనీ, ఎక్కడకు రమ్మంటే అక్కడకు పోలేదని, అందువల్ల తనను పిచ్చిదని ముద్ర వేసిన వారూ ఉన్నారని కంగనా అంటోంది. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి కంగనా చెబుతోందో బాలీవుడ్ జనానికి విడమరచి చెప్పక్కర్లేదు. కానీ, హృతిక్ రోషన్ గురించే కంగనా ఈ కామెంట్స్ చేస్తోందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. నిజమేనా…కంగనా!?