Kalyan Ram Gives Clarity On NTR Role in Bimbisara 2: బింబిసార ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘బింబిసార 2’ కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పాడు. అదే సమయంలో జూ. ఎన్టీఆర్ ప్రస్తావన కూడా వచ్చింది. అంతే.. అప్పట్నుంచి ‘బింబిసార 2’లో తారక్ కూడా ఉంటాడని, ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత నందమూరి సోదరుల్ని వెండితెరపై చూడొచ్చన్న ప్రచారాలు ఊపందుకున్నాయి. కానీ, ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా కళ్యాణ్ రామ్ కొట్టిపారేశాడు. ఇది కేవలం ఊహాగానం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు.
‘‘బింబిసార 2లో తారక్ కూడా ఉన్నాడని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. అసలు దాని గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఇది కేవలం ఊహాగానం మాత్రమే’’ అని కళ్యాణ్ తెలిపాడు. ఇక బింబిసార కథను రెండు భాగాల్లో చెప్పాలని తాము ముందుగానే నిర్ణయించుకున్నామని, అందుకు తగినట్టుగానే కథని సిద్ధం చేశామని చెప్పాడు. ప్రస్తుతానికి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని తొలి భాగాన్ని రూపొందించామని.. ఇది ప్రేక్షకులకు నచ్చితే రెండో భాగంపై ఆసక్తి మొదలవుతుందని అన్నాడు. అప్పుడే ‘బింబిసార 2’ను మరింత అద్భుతంగా తెరకెక్కించగలమని వెల్లడించాడు. అంతేకాదు.. ఈ చిత్రానికి మరిన్ని సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నామని మరో షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు కళ్యాణ్ రామ్. అయితే.. అవి రావాలంటే మాత్రం ‘బింబిసార’ హిట్ అవ్వాల్సిందే!
ఇక బింబిసార థియేటర్లలో చూడాల్సిన సినిమా అని, కచ్ఛితంగా ఇది ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని కళ్యాణ్ తెలిపాడు. ఎప్పట్నుంచో తనకు సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించాలని ఉండేదని, దర్శకుడు వశిష్ట్ కారణంగా ఆ కల నెరవేరిందని, అందుకు తనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నాడు. ట్రైలర్ విడుదలైన తర్వాత ‘బింబిసార’ను మగధీర, బాహుబలితో పోల్చడం సంతోషంగా అనిపించిందన్నాడు.