The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!

The India Story

The India Story

The India Story : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా రేపు (జూలై 24న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ భాషల్లో విడుదల నిలిపివేసినట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో వ్యవసాయ రంగంలో పురుగుమందుల వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలను మేకర్స్ చూపించనున్నారు. సమాజంలో చర్చకు దారితీసే అంశాన్ని స్టోరీగా ఎంచుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్న కాజల్‌కు ఈ సినిమా మరో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇంకా పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ప్రస్తుతం అనుకున్న తేదీకి రిలీజ్ కావడం లేని సమాచారం. ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అనుకున్న తేదీకి విడుదల కానుందని చిత్ర బృందం నుంచి సమాచారం అందుతోంది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను సాగర్ బి.షిండే నిర్మించారు. సామాజిక సందేశంతో తెరకెక్కిన ‘ది ఇండియా స్టోరీ’కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.