ఈ యేడాది అత్యధికంగా ఫిబ్రవరిలో 30 సినిమాలు విడుదల కాగా… ఆ తర్వాత 29 సినిమాలు విడుదలైన నెల జూన్ కావడం విశేషం. అయితే ఇందులో పది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో అనువాద చిత్రాలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిభ చూపలేదు. ఆ కొరతను జూన్ నెల తీర్చేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ రకంగా ఈ అనువాద చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ‘మానగరం’, ‘ఖైదీ’, ‘మాస్టర్’ చిత్రాల తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించడం ఓ విశేషం కాగా అందులో కమల్ తో పాటు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురికీ దీటుగా సినిమా క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, థియేటర్లలోని కుర్రకారులో హుషారు నింపేశాడు. ఫలితం బాక్సాఫీస్ కలెక్షన్ల రూపంలో కనిపించింది. చాలా కాలం తర్వాత ‘విక్రమ్’తో కమల్ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది.
జూన్ లో విడుదలైన సినిమాల విషయానికి వస్తే… ఈ నెల రెండో తేదీ మలయాళ చిత్రం ‘జనగణమన’.. తెలుగు వర్షన్ ‘జన 2022’ పేరుతో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. సమకాలీన సాంఘిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ ఊహించని మలుపులు తిరుగుతూ చూపరులను కట్టిపడేసింది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్’ మూవీ 3వ తేదీ విడుదలైంది. అడివి శేష్… స్వెట్ అండ్ బ్లెడ్ ధారపోసి ఈ సినిమా చేశాడంటే అతిశయోక్తి కాదు. దానికి తగ్గట్టుగానే ‘మేజర్’ చక్కని విజయాన్ని అందుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం ‘మేజర్’ టీమ్ ను అభినందించడం విశేషం. ఇక ఇదే వారం ‘విక్రమ్’తో పాటు విడుదలైన అక్షయ్ కుమార్ ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ ఊహించని విధంగా పరాజయం పాలైంది. అలానే మలయాళ డబ్బింగ్ సినిమా ‘మయూరాక్షి’ సైతం పరాజయం పొందింది.
జూన్ రెండోవారంలో నాలుగు స్ట్రయిట్ మూవీస్ తో పాటు మూడు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ…’ మూవీకి ఎంటర్ టైనింగ్ గా ఉందనే పేరు వచ్చినా, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియాకు ఇది చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇదే వారం ‘సురాపానం, జరిగిన కథ’ చిత్రాలు విడుదల అయ్యాయి. అలానే కళ్యాణ్ దేవ్ నటించిన ‘కిన్నెరసాని’ జీ 5లో స్ట్రీమింగ్ అయ్యింది. కానీ ఎలాంటి వైబ్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ వారం అనువాద చిత్రాలు ‘జురాసిక్ వరల్డ్ డొమీనియన్’తో పాటు ‘777 చార్లీ’ జనం ముందుకు వచ్చాయి. ‘777 చార్లీ’ సెన్సిబుల్ గా ఉందనే గుర్తింపును మాత్రం పొందింది. ఇక మలయాళ చిత్రం ‘సి.బి.ఐ. 5: ద బ్రెయిన్’ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. బట్ ఎవరూ దీని గురించి మాట్లాడుకోనే లేదు!
జూన్ మూడోవారంలో నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఓ2’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. వివాహానంతరం జనం ముందుకొచ్చిన నయనతార తొలిచిత్రం ఇదే. కానీ ఈ సినిమా వీక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇక ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రానా, సాయిపల్లవి ‘విరాటపర్వం’ మూవీ జూన్ 17న రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందు ఈ చిత్రానికి బజ్ క్రియేట్ అయ్యింది. సరళ అనే మహిళా నక్సలైట్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటీమణులు ప్రియమణి, నందితాదాస్ నటించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం అందలేదు. ఇదే వారంలో వచ్చిన సత్యదేవ్ ‘గాడ్సే, కిరోసిన్, మొనగాడు, యు ఆర్ మై హీరో’ సినిమాలన్నీ ఇంటిదారే పట్టాయి.
కొండా మురళీ, సురేఖ జీవిత సంఘటనల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కొండా’ జూన్ 23న విడుదలై కొండెక్కేసింది. అర్థసత్యాలతో ఈ బయోపిక్ అసంపూర్ణంగా ఉందనే విమర్శలు వచ్చాయి. జూన్ 24న విడుదలైన ఎనిమిది స్ట్రయిట్ సినిమాలలో ఏ ఒక్కటీ తనదైన ముద్రను ప్రేక్షకుల మీద వేయలేకపోయింది. పూరి తనయుడు ఆకాశ్ ‘చోర్ బజార్’, చదలవాడ శ్రీనివాసరావు కొడుకు లక్ష్ ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’, ఎమ్మెస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ ‘7 డేస్ 6 నైట్స్’ కిరణ్ అబ్బవరం ‘సమ్మతం’ సైతం పరాజయం పాలయ్యాయి. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన తమిళచిత్రం ‘మన్మథ లీల’ తెలుగు వర్షన్ 24వ తేదీన చడీచప్పుడు లేకుండా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే ఈ నెలలో ఆఖరి చిత్రంగా యానిమేషన్ మూవీ ‘మినియన్స్: ది రైజ్ ఆఫ్ గ్రూ’ 30న విడుదలవుతోంది. మొత్తం మీద జూన్ లో అనువాద చిత్రం ‘విక్రమ్’ అనూహ్య విజయం సాధించగా.. స్ట్రయిట్ సినిమా ‘మేజర్’ పర్వాలేదనిపించే సక్సెస్ అందుకోవడం విశేషం.