కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కమిటైనప్పుడే.. ఇందులో కథానాయికగా నటించేందుకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విషయాన్ని పలుసార్లు ఆలియా కన్ఫమ్ చేసింది కూడా! అయితే.. అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడం, రణ్బీర్‌తో పెళ్ళి కూడా అయిపోవడంతో.. ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటినుంచి NTR30లో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు మొదలయ్యాయి.
ఆలియా తప్పుకున్నాక మేకర్స్ చాలామంది కథానాయికల్ని పరిశీలించారు. ఇదో పాన్ ఇండియా సినిమా కాబట్టి.. హిందీలో మంచి మార్కెట్, క్రేజ్ ఉన్న భామనే తీసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో జాన్వీ కపూర్ తెరమీదకొచ్చింది. ఆమె దాదాపు కన్ఫమ్ అయ్యిందన్న ప్రచారమూ జరిగింది. కానీ, ఆ తర్వాత జాన్వీని అసలు సంప్రదించనే లేదని క్లారిటీ వచ్చేసింది. కొన్ని రోజుల అనంతరం సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్ నడిచింది. అయితే, యూనిట్ వర్గాల నుంచి ఆ విషయమై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇంతలో శ్రద్ధా కపూర్ పేరు తెరమీదకొచ్చింది. ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి, ఈమెనే ఫైనల్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని రూమర్లొచ్చాయి. ఇందులోనూ వాస్తవం లేదని తేలిపోయింది.
ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ భామ పేరు తెరమీదకొచ్చింది. ఆమె మరెవ్వరో కాదు.. దిశా పతాని. నిత్యం బికినీ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోన్న ఈ భామని కథానాయిక పాత్రకు తీసుకోవాలని మేకర్స్ యోచిస్తున్నారట! ఈమెని ఎంపిక చేస్తే, మార్కెట్ పరంగా బాలీవుడ్‌లో కలిసొస్తుందని, గ్లామర్ కూడా తోడవుతుందని మేకర్స్ ఉద్దేశం. అయితే, ఇది నిజమా? కాదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ దిశా కన్ఫమ్ అయితే మాత్రం, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం!