నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్ 1996, జనవరి 18 న కన్నుమూశారు.
కాగా నేడు ఎన్టీఆర్ 26 వ వర్ధంతి కావడంతో నందమూరి అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు. ఇక తాత ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకుని పుట్టిన జూ. ఎన్టీఆర్ కూడా ఆయనలానే స్టార్ గా ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక నేడు తాత వర్ధంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు. ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ “తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక తారక్ తో పారు మరో మనవడు, హీరో కళ్యాణ్ రామ్ సైతం తాతను గుర్తుచేసుకొని ట్వీట్ చేశారు.