Joruga Husharuga Trailer: బేబి చిత్రంతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్‌ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఈ సినిమా తరువాత విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. అను ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విరాజ్ సరసన పూజిత పొన్నాడ కథానాయికగా నటిస్తుంది. యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబరు 15న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ తో ట్రైలర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. బ్రహ్మజీ కామెడీ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.
ఇక ట్రైలర్ విడుదల అనంతరం బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. “బేబి సినిమాతో విరాజ్ అశ్విన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. విరాజ్, పూజిత కలిసి నటించిన ఈ ‘జోరుగా హుషారుగా’ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. మంచి కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. చిత్రయూనిట్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తూ.. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని” అన్నారు.
చిత్ర నిర్మాత నిరీష్ తిరువిధుల మాట్లాడుతూ.. “యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. చిత్ర ట్రైలర్ బుచ్చిబాబుగారి చేతుల మీదుగా విడుదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చేయబోతున్న చిత్రానికి మా టీమ్ తరపున ఆల్ ద బెస్ట్ చెబుతున్నాము. జోరుగా హుషారుగా సినిమాలో అందర్ని ఆకట్టుకునే వినోదం వుంది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నామని” అన్నారు.
చిత్ర దర్శకుడు అను ప్రసాద్ మాట్లాడుతూ.. “ముందుగా బుచ్చిబాబుగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్‌ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్‌కు దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువవుతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుందని” అన్నారు. మరి ఈ సినిమాతో విరాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.