బాలీవుడ్ కండల వీరుల్లో మేటి అనిపించుకున్న జాన్ అబ్రహామ్ హీరోగా మెప్పించడమే కాదు, నిర్మాతగా, కథకునిగానూ రక్తి కట్టించాడు. జాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎటాక్’కు ఆయనే కథకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘ఎటాక్-2’ తీస్తే అందులో తనతో పాటు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తే ఈ సారి బంపర్ హిట్ ఖాయమని ఈ మధ్యే చెప్పాడు. ఇప్పుడు తన మనసులోని మరో కోరికను బయట పెట్టాడు జాన్. అదేమిటంటే హాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ‘ఓషన్స్ లెవెన్’ ను హిందీలో రీమేక్ చేయాలని ఉందట!
Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్
‘ఓషన్స్ లెవెన్’ అనే టైటిల్ తో 1960లో ఫ్రాంక్ సినాట్రా, డీన్ మార్టిన్, శామీ డేవిస్ జూనియర్ వంటివారు నటించిన చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. అదే కథను అదే టైటిల్ తో 2001లో డైరెక్టర్ స్టీవెన్ సోడెన్ బెర్గ్ రీమేక్ చేశాడు. ఇందులో జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, మ్యాట్ డామ్ వంటివారు నటించారు. ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో వరుసగా ‘ఓషన్స్ … ఫ్రాంచైజ్’లో మరికొన్ని సినిమాలు వెలుగు చూశాయి. వాటన్నిటిలోని కొంత కొంత కథను తీసుకొని బాలీవుడ్ కు అనుగుణంగా స్టోరీ రాసుకుంటే ‘ఓషన్స్ లెవెన్’ను తెరకెక్కించ వచ్చునని జాన్ అంటున్నాడు. అందులో తాను బ్రాడ్ పిట్ పాత్రకు సరిపోతానని, జార్జ్ క్లూనీ పోషించిన పాత్రకు అక్షయ్ కుమార్, మ్యాట్ డామ్ రోల్ కు టైగర్ ష్రాఫ్ సరితూగుతారని జాన్ చెబుతున్నాడు. ఐడియా బాగుంది… ఎలాగూ జాన్ కథలు కూడా రాస్తాడు కాబట్టి, ఆ పని ఆయనే తీసుకుంటాడు. మరి అక్షయ్, టైగర్ ఏమంటారో! అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలీవుడ్ లో ‘ఓషన్స్’ను చూడొచ్చు!