‘Jersey’ hit hard!:
తెలుగులో మోడరేట్ హిట్ అయ్యిన ‘జెర్సీ’ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని, అదే ‘జెర్సీ’ విషయంలోనూ జరిగిందని ‘దిల్’ రాజు అన్నారు. తమ ఇటీవల విడుదల చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ విషయంలోనూ నిరాశ మిగిలిందని అన్నారు. ”’హిట్’ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ రూ. 15 కోట్లు ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఇవాళ 6, 7 కోట్ల రూపాయలే వచ్చాయి. అయితే ఎలాగొలా బయటపడతామనే నమ్మకం ఉంది. మంచి సినిమాలకు సైతం ఇలాంటి ఓపెనింగ్స్ వస్తున్నాయంటే మేం డబుల్ చెక్ చేసుకోవాల్సి ఉంది. మొన్న ‘జెర్సీ’ విషయంలోనూ అదే జరిగింది. పేండమిక్ సిట్యుయేషన్ లేకుంటే ‘జెర్సీ’ 30 కోట్ల రూపాయల లాభం తీసుకు రావాల్సిన సినిమా. వెళ్తున్న కొద్ది 15 కోట్లు మాత్రమే వస్తుందని అనుకున్నాం. ఇంకోస్టేజ్ లో పది కోట్లు వస్తాయని అనుకున్నాం. రిలీజ్ డేట్ కూడా మూడుసార్లు మార్చాం. ఇక లాభం రాకున్నా ఫర్వాలేదు, బయట పడితే చాలనుకున్నాం. చివరకు రూ. 3-4 కోట్ల డ్యామేజ్ తో బయటపడ్డాం” అని అన్నారు. ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని, ఓటీటీలో సూపర్ హిట్ అయినా వచ్చేదేమీ ఉండదని, అదే థియేటర్లలో రిలీజ్ అయి సక్సెస్ అయితే వచ్చే ఆ ఎనర్జీ వేరని చెప్పారు. నిర్మాతల పట్ల హీరోలకు తప్పకుండా ఓ సానుకూల భావనే ఉంటుందని, వాళ్ళకు అన్నీ తెలుసని, అందుకే పరిస్థితులను వారిని కూర్చోపెట్టి చెబితే బాగుంటుందని, వారు కూడా అర్థంచేసుకుంటారనే నమ్మకం తనకుందని, అలా చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ‘దిల్’ రాజు అన్నారు.