Jayaprada: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ నేటి ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. కైకాల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయనతో గడిపిన క్షణాలను, ఆయన గొప్పతనం గురించి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా సినీ నటి జయప్రద, కైకాలతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
“కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఈ విషాద వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ‘అడవిరాముడు’, ‘యమగోల’ తదితర ఎన్నో చిత్రాల్లో మేము కలిసి నటించాము. నటనకు నిఘంటువు కైకాల సత్యనారాయణ గారు.. తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని స్థానం ఆయనది. కైకాల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు.