కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై భీమ్ సినిమా అంతర్జాతీయ వేదికపై చర్చకు రావడం విశేషం.
‘జై భీమ్’ సినిమాలోని కీలక సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ అయినటువంటి ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ వారు ప్రసారం చేశారు. జైలు వద్ద దొంగలను కులాల వారిగా విభజించి జైలుకు తరలిస్తున్న సీన్ దగ్గర నుంచి సినతల్లి భర్త పామును పట్టడం, దొంగగా ముద్రవేసి అరెస్ట్ చేయడం, లాయర్ గా సూర్య ఎంట్రీ ఇవ్వడం, చివర్లో సూర్య అద్భుతమైన వాదనను కలిపి మొత్తం 12 నిమిషాల సీన్ ని ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ వారు ప్రసారం చేశారు. ఇప్పటివరకు ఏ తమిళ్ సినిమా ఇలా అంతర్జాతీయ వేదికపై ప్రసారం కాలేదు. దీంతో సూర్య అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఒక్క వారే అని కాకుండా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికీ ఇది గర్వించతగ్గ విషయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
