TJ Gnanavel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రియల్ స్టోరీలను ప్రజలకు చూపించడంలో ఈ దర్శకుడు ముందు ఉంటాడు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడంలో టిజె జ్ఞానవేల్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే జై భీమ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు జ్ఞానవేల్. ఒక దళిత మహిళా న్యాయ పోరాటాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఈ సినిమా ఆస్కార్ కూడా నామినేట్ కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా తరువాత మరో రియల్ స్టోరీని తెరకెక్కిస్తున్నట్లు జ్ఞానవేల్ ప్రకటించాడు. ఈసారి భర్తను చంపిన ఒక వ్యాపారిపై భార్య చేసిన న్యాయ పోరాటాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ భార్య ఎవరో కాదు జీవజ్యోతి.. తమిళనాడులో సంచలనం సృష్టించిన కేసును దోశా కింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇది హిందీలో తెరకెక్కడం విశేషం. జీవజ్యోతి అనే మహిళ తన భర్తను చంపిన దోశా కింగ్ రాజగోపాల్ కు శిక్ష పడేలా చేయడానికి 18 ఏళ్ళు న్యాయ పోరాటం చేసింది.
అసలు ఎవరు జీవ జ్యోతి.. ఏంటీ ఆమె కథ అంటే.. చెన్నైలోని శరవణ భవన్ రెస్టారెంట్ చెయిన్ యజమాని పిచ్చై రాజగోపాల్. ఆయనకు ఎన్నో రెస్టారెంట్స్, వ్యాపారాలు ఉన్నాయి. అయితే అతనికి జాతకాల పిచ్చి ఎక్కువ.. ఒకానొక రోజు తన దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి కూతురు జీవజ్యోతిని పెళ్లాడితే.. తనకు రాజయోగం పడుతుందని, తన దశ తిరిగిపోతుందని ఒక పండితుడు చెప్పగా.. ఆమె వెంట పాడడం మొదలుపెట్టాడు రాజగోపాల్. అప్పటికే జీవజ్యోతికి పిన్స్ శాంత కుమార్ తో వివాహమైపోయింది. అయినా ఆమె వెంట పడడం మానలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని, తనకు మూడో భార్యగా రావాలంటూ వేధించాడు. డబ్బుకు లొంగని జీవజ్యోతి అతడిని చీదరించుకొంది. భర్తను వదిలి రానని చెప్పింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రాజగోపాల్ 2001 అక్టోబర్ లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. భర్త మృతి చెందిన తరువాత జీవజ్యోతి నయయపోరాటం మొదలయ్యింది. రాజగోపాల్ పై కేసు వేసింది. అన్ని ఆధారాలతో అతడు అరెస్ట్ అయ్యాడు. కోర్టు అతడికి జీవిత ఖైదును విధించింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు.
అనారోగ్యం కారణంగా రాజగోపాల్ బెయిల్ పై బయటికి వచ్చాడు. దాదాపు 18 ఏళ్లు అతడు బయటే ఉన్నాడు. మళ్లీ 2019 లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం వలన అతడు మళ్లీ జైలుకు వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక 18 ఏళ్లు జీవజ్యోతి చేసిన న్యాయపోరాటమే ‘దోశా కింగ్’ సినిమా. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ స్టోరీపై ఒక పుస్తకం కూడా వచ్చింది. దాని పేరు ‘మర్డర్ ఆన్ ది మెనూ’. ఇక ఈ సినిమాపై జీవజ్యోతి మాట్లాడుతూ తన పడిన కష్టం కన్నా నిజం ఏంటో చూపించాలని, ఇప్పటికైనా నిజం ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.