ఇప్పుడంటే జాకీ ష్రాఫ్ ఎవరు అన్న ప్రశ్నకు టైగర్ ష్రాఫ్ తండ్రి
అనే సమాధానం లభిస్తుందేమో కానీ, ఒకప్పుడు జాకీ ష్రాఫ్ చేయి తగిలితే చాలు అని పలవరించిన భామలు ఉన్నారు. జాకీ ష్రాఫ్ యాక్టింగ్ స్టైల్ చూసి ఫిదా అయిపోయిన వారెందరో! అడపా దడపా తెలుగు చిత్రాల్లోనూ విలన్ గానో, కేరక్టర్ యాక్టర్ గానో దర్శనమిచ్చే జాకీ ష్రాఫ్ అందరికన్నా ముందు తెలుగువారికే పరిచయస్థుడు. అదెలాగంటే మన హైదరాబాద్ లో తయారయ్యే చార్మినార్ సిగరెట్స్
కు అప్పట్లో జాకీ ష్రాఫ్ బ్రాండ్ అంబాసిడర్. భాగ్యనగరం అంతటా అప్పట్లో జాకీ పోస్టర్స్ విశేషంగా కనిపించేవి. ఇక తెలుగు పత్రికల్లో చార్మినార్ సిగరెట్స్
యాడ్స్ లోనూ జాకీ రూపం దర్శమిచ్చేది. అందువల్ల జాకీ ష్రాఫ్ తెరపై కనిపించగానే మనవాడు అని అభిమానించేశారు తెలుగువారు. హీరో
సినిమాతో జనం మదిని దోచిన జాకీ ష్రాఫ్ కథ కూడా ఓ సినిమాలాగే ఉంటుంది.
జాకీ పూర్తి పేరు జయ్ కిషన్ కకుభామ్ ష్రాఫ్. 1957 ఫిబ్రవరి 1న జాకీ జన్మించారు. ఆయన తండ్రి గుజరాతీ, తల్లి కజకిస్థాన్ కు చెందినవారు. జీవనోపాధి కోసం జాకీ తల్లివైపు తాత తొలుత ఢిల్లీకి, తరువాత ముంబయ్ కి చేరుకున్నారు. అదే సమయంలో జాకీ తండ్రి వైపు ఆస్తులు కూడా కరిగిపోయాయి. 17 ఏళ్ళ వయసులో జాకీ తండ్రి ఇల్లు వదలి ముంబైకి వచ్చారు. ఆ టీనేజ్ లోనే ప్రేమలో పడ్డారాయన. అలా జాకీ వారి బిడ్డగా పుట్టారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడంతో జాకీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనే చదువుకు స్వస్తి పలికారు. తరువాత కొన్ని హోటల్స్ లో చెఫ్ గానూ పనిచేశారు. అయితే అక్కడా ఆయనకు క్వాలిఫికేషన్స్ లేవని ఉద్వాసన పలికారు. ట్రావెలింగ్ ఏజెంట్ గా పనిచేసే రోజుల్లోనే అతని స్టైల్ నచ్చి, కొందరు తమ యాడ్స్ లో నటింపచేశారు. ఆ తరువాతే చార్మినార్ సిగరెట్స్
యాడ్స్ లో జాకీ కనిపించారు. అలా సాగుతున్న ఆయన ప్రస్థానంలో దేవానంద్ రూపంలో అదృష్టం కలసి వచ్చింది. దేవానంద్ తాను నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన స్వామి దాదా
లో జాకీకి నటునిగా అవకాశం కల్పించారు. అదే జాకీ తొలి చిత్రం. అందులో జాకీని చూసిన సుభాష్ ఘయ్ తన హీరో
అతడే అని ఫిక్స్ అయిపోయారు. హీరో
సినిమా విడుదలైన సమయంలో అందులో నాయికగా నటించిన మాధురీ దీక్షిత్ అందానికి ఎంతమంది కుర్రాళ్ళు మనసు పారేసుకున్నారో, అంతకంటే రెట్టింపు అమ్మాయిలు జాకీని తమ కలల రాకుమారునిగా చేసుకున్నారు. హీరో
ఆధారంగానే తెలుగులో నాగార్జున హీరోగా పరిచయమైన విక్రమ్
తెరకెక్కింది. ఏయన్నార్ నటవారసుడు నాగార్జున హీరో
రీమేక్ లో నటిస్తున్నాడని తెలియగానే, హీరో
చిత్రాన్ని మళ్ళీ తెలుగు జనాలు చూశారు. అలా తెలుగువారికి సుపరిచితుడై పోయారు జాకీ. పైగా ఆ రోజుల్లో మీసాలతో నటించే హిందీ హీరోలు తక్కువగా కనిపించేవారు. ఆ రీతిన కూడా జాకీ తెలుగువారిని ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.
జాకీ హీరోగా రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేశాయి. అయినా ఏనాడూ హీరో వేషాలే వేస్తానని మడికట్టుకు కూర్చోలేదు. మల్టీస్టారర్స్ లోనూ నటించడం మొదలు పెట్టారు. అనిల్ కపూర్ తో జాకీ నటించిన పలు చిత్రాలు జనాన్ని అలరించాయి. పరిందా
లో జాకీ నటనకు ఉత్తమ నటునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. అనిల్ కపూర్ తోనే కాకుండా, అప్పటి వర్ధమాన కథానాయకులు సన్నీడియోల్, సంజయ్ దత్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అలరించారు జాకీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నారు జాకీ. తరువాత తన దరికి చేరిన పాత్రలను అంగీకరిస్తూ అనేక భాషల్లో నటించారు. జాకీ ష్రాఫ్ నటించిన తొలి తెలుగు చిత్రం మంచు విష్ణు హీరోగా రూపొందిన అస్త్రం
. ఆ తరువాత బ్యాంక్, బ్లాక్ అండ్ వైట్, శక్తి, పంజా, సాహో
వంటి తెలుగు సినిమాల్లోనూ అభినయించారు.
జాకీ ష్రాఫ్ మోడల్ గా ఉన్న రోజుల్లోనే ఆయేషా దత్ ను ప్రేమించారు. జాకీ స్టార్ అయిన తరువాత ఆమెనే పెళ్ళాడారు. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి టైగర్ ష్రాఫ్ నవతరం కథానాయకునిగా సాగుతున్నాడు. కూతురు పేరు కృష్ణ ష్రాఫ్. జాకీ, ఆయేషా దంపతులు పలు సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటూ ఉంటారు. జాకీ ష్రాఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రాలకు జాకీ భార్య ఆయేషా నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. తలస్సేమియాతో బాధపడేవారికి, అవగాహన కలిస్తూ సాగుతున్నారుజాకీ. ఇండియాలో తలేస్సేమియాకు బ్రాండ్ అంబాసిడర్. అలాగే ఎయిడ్స్ బాధితులకు ఊరట కలిగించడంలోనూ, లింగవివక్ష చూపిస్తూ గర్భస్రావాలు చేయించుకొనేవారిలోనూ అవగాహన కలిగిస్తున్నారు. ఇలా తనకు చేతనైన సాయం అందించడానికి జాకీ, ఆయన భార్య ఆయేషా ఎప్పుడూ ముందుంటారు.