జాకీ చాన్ ‘ద మిత్’ చూసిన వారెవరికైనా అందులో ఆయన అభినయం గిలిగింతలు పెట్టక మానదు. ‘ద మిత్’ కథ ఆధారంగానే రాజమౌళి తన ‘మగధీర’ సినిమాలో కొంత భాగం రూపొందించారని అందరికీ తెలుసు. 2005లో బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ద మిత్’కు దాదాపు 18 ఏళ్ళ తరువాత సీక్వెల్ తెరకెక్కించాలని భావిస్తున్నారు. దర్శకుడు స్టాన్లీ టాంగ్ రూపొందించిన ‘ద మిత్’ అప్పట్లో 15 మిలియన్ డాలర్లతో రూపొంది, మంచి లాభాలు చూసింది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించాలన్న తలంపు కలిగింది.
ప్రస్తుతం ఈ సీక్వెల్ కు 50 మిలియన్ డాలర్లు బడ్జెట్ అని అంచనా వేస్తున్నారు. చైనా ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇది భారీ మొత్తం అనే చెప్పాలి. 51 ఏళ్ళ వయసులో ‘ద మిత్’లో తనదైన బాణీ పలికిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించారు జాకీ చాన్. ఇప్పుడు ఆయన వయసు 69 సంవత్సరాలు. ఈ వయసులోనూ అంతకు తక్కువేమీ కాకుండా నటించాలనే ఆయన ఆశిస్తున్నారు. జాకీ ఉత్సాహం చూస్తోంటే ఇప్పటికిప్పుడు ఈ సినిమాను సెట్స్ పైకి పరుగులు తీయించాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సారి ‘ద మిత్’ సీక్వెల్ లో జాకీ ఏ తీరున తన బాణీ పలికిస్తారో చూడాలి.