అల్లరి చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని కామెడీ హీరోగా ఎదిగాడు. ఇక తండ్రి మరణానంతరం కొన్ని ప్లాపులను చవిచూసిన ఈ హీరో ఇక ట్రెండ్ కు తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకొని రొట్ట సినిమాలకు గుడ్ బై చెప్పి కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. గతేడాది నాంది చిత్రంతో అల్లరి నరేష్ సంచలనం సృష్టించిన విషయం విదితమే. అన్యాయంగా ఒక కేసులో ఇరుక్కున్న ఒక యువకుడు దానివలన తన జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా పోగొట్టుకున్నాడు అనే కథతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. ఇక ఈసారి కూడా అల్లరోడు మరో కొత్త కథతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిపోయాడు.
అల్లరి నరేష్ హీరోగా “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం”అనే సినిమా తెరకెక్కుతోంది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. పోస్టర్ ఎంతో ఉత్కంఠను రేపుతోంది. ఒంటినిండా గాయాలతో నరేష్ మంచం కోడును పట్టుకొని దీనంగా చూస్తూ నిలబడ్డాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. నాంది లో తన సొంత సమస్య కోసం పోరాడితే.. ఈ సినిమాలో మారేడుమిల్లి ప్రజల కోసం ఈ హీరో పోరాడనున్నాడట. అయితే ఇది కూడా మరో నాంది అయ్యేలా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ చిత్రంతో మరో హిట్ ను అల్లరోడు తన ఖాతాలో వేసుకుంటాడమో చూడాలి.