పవన్ కళ్యాణ్ తన పాతికేళ్ళ కెరీర్ లో ఇప్పటి దాకా నటించిన చిత్రాలు పట్టుమని పాతికే! అందులో పవన్ కు, ఆయన ఫ్యాన్స్ కు ఆనందం పంచిన చిత్రాలు రీమేక్స్ కావడం గమనార్హం! ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’గా వస్తున్నాడు. ఈ సినిమా మళయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్! దాంతో పవన్ ఫ్యాన్స్ లో ఆనందం చిందులు వేస్తోంది.
Read Also : Bheemla Nayak : ఫ్యాన్స్ విరాళాలు!
పవన్ 1996లో తొలిసారి హీరోగా జనం ముందునిలచిన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’ సినిమా హిందీ ‘ఖయమాత్ సే ఖయామత్ తక్’కు ఫ్రీమేక్! రెండో చిత్రం ‘గోకులంలో సీత’, మూడో సినిమా ‘సుస్వాగతం’ రీమేక్స్. ‘జల్సా’ తరువాత పవన్ పరాజయాల బాట పట్టినప్పుడు ఆదుకున్న ‘గబ్బర్ సింగ్’ హిందీ లో ఘనవిజయం సాధించిన ‘దబంగ్’ రీమేక్! ‘అత్తారింటికి దారేది’ తరువాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ పవన్ ను పలకరించలేదు. ఆ తరువాత వచ్చిన “కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్” చిత్రాలు కూడా రీమేక్స్. కానీ, అంతగా అలరించలేదు. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’పై పవన్ ఫ్యాన్స్ లో ఆశలు చిగురించాయి. పవన్ కెరీర్ లో ‘ఖుషి’ రీమేక్ అయినా ఫ్యాన్స్ ను విశేషంగా అలరించింది. ఆ తరువాత వరుస ఫ్లాపులు ‘జల్సా’తోనే మళ్ళీ బంపర్ హిట్ దక్కింది. ‘గబ్బర్ సింగ్’ ఘనవిజయం తరువాత వచ్చిన ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ ముంచేసింది. ‘అత్తారింటికి దారేది’ మళ్ళీ గ్రాండ్ సక్సెస్ చూపించింది. ఇలా రెండు సార్లు పవన్ కు భారీ విజయాలు చూపించారు దర్శకరచయిత త్రివిక్రమ్. అయితే పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా ‘అజ్ఞాతవాసి’ నిరాశ పరచింది. కానీ, ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ ఆశలు రేపుతోంది. కారణం, ఈ చిత్రానికి త్రివిక్రమ్ సంభాషణలు సమకూర్చడం.
అంతలా పవన్ ఫ్యాన్స్ కు ‘భీమ్లా నాయక్’ ఆశలు రేపడానికి కారణమేంటి? పవన్ కు రీమేక్స్ అచ్చి వస్తాయన్న సెంటిమెంట్ ఓ కారణమయితే, దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం చేయకుండా కేవలం రచన మాత్రమే చేయడం మరో కారణం. మరి ఫ్యాన్స్ సెంటిమెంట్ ను ‘భీమ్లా నాయక్’ ఏ తీరున నెరవేరుస్తాడో చూడాలి.