Dil Raju Vs C. Kalyan: గత ఆదివారం తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు జరిగాయి. అందులో సీనియర్ నిర్మాతలు సి. కళ్యాణ్, ‘దిల్’ రాజు వేర్వేరు ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగారు. అధ్యక్షుడిగా ‘దిల్’ రాజు ప్యానల్ నుండి కె. ఎల్. దామోదర ప్రసాద్ గెలువగా, గౌరవ కార్యదర్శులుగా సి. కళ్యాణ్ ప్యానెల్ నుండి తుమ్మల ప్రసన్న కుమార్, వైవియస్ చౌదరి గెలిచారు. సంయుక్త కార్యదర్శులుగా ‘దిల్’ రాజు ప్యానెల్ నుండి భరత్ చౌదరి, సి. కళ్యాణ్ ప్యానెల్ నుండి నట్టికుమార్ విజయం సాధించారు. అయితే ఈసీ మెంబర్స్ లో ‘దిల్’ రాజు ప్యానెల్ పై చేయి సాధించింది. ఆ ప్యానెల్ నుండి 10 మంది గెలువగా, సి. కళ్యాణ్ ప్యానెల్ నుండి ఐదు మంది మాత్రమే విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ‘తామంతా ఒక్కటేనని, తమ మధ్య పొరపొచ్చలు ఉండవ’ని ప్రకటించారు. సి. కళ్యాణ్ సైతం ఓ ఇద్దరు చీడపురుగుల్ని నిర్మాతలు దూరం పెట్టారని, అదే తాము కోరుకున్నామని చెప్పారు.
తాజా పరిణామాలను చూస్తుంటే… వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కు ఇంకా ఫుల్ స్టాప్ పడలేదనిపిస్తోంది. ఎందుకంటే… ‘దిల్’ రాజు, సి. కళ్యాణ్ నిర్మించిన సినిమాలు రెండూ వచ్చే శుక్రవారం బాక్సాఫీస్ బరిలో పోటీ పడబోతున్నాయి. ‘దిల్’ రాజు ఇప్పుడు తన వారసులను నిర్మాతలుగా రంగంలోకి దించాడు. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ పేరుతో ఆయన కుమార్తె హన్షిత, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరు నిర్మించిన ‘ఏటీఎం’ అనే వెబ్ సీరిస్ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి, మంచి ఆదరణ పొందింది. అలానే వీరిరువురు కలిసి కమెడియన్ వేణు ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘బలగం’ పేరుతో ఓ సినిమా నిర్మించారు. దీని ప్రీమియర్ షోస్ ను ఇప్పటికే కొన్ని చోట్ల ప్రదర్శించారు. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘బలగం’ మూవీని మార్చి 3న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దాంతో సి. కళ్యాణ్ తన జీవిత భాగస్వామి కోనేరు కల్పన నిర్మించిన ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ చిత్రాన్ని కూడా అదే తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత మరోసారి మెగా ఫోన్ చేపట్టి తీసిన సినిమా ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’. రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహైల్, మృణాళిని రవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఈ మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని కొద్ది రోజులుగా మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తోంది. కానీ మార్చి 3వ తేదీనే ఈ సినిమానూ ‘బలగం’పై వేయడం చూస్తుంటే… సి. కళ్యాణ్, దిల్ రాజు మధ్య కోల్డ్ వార్ ఇంకా ముగియలేదనిపిస్తోంది. నిజానికి 3వ తేదీని తమ చిత్రాలను విడుదల చేయబోతున్నట్టు పలువురు చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అందులో ‘రిచి గాడి పెళ్ళి’, ‘గ్రంథాలయం’, ‘సాచి’, ‘ఇన్ కార్’, ‘బిగ్ స్నేక్ కింగ్’ చిత్రాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా అదే రోజున విడుదల అవుతాయా లేకపోతే ఒకటి రెండు సినిమాలు వెనక్కి వెళతాయా అన్నది వేచి చూడాలి.