Santhosh Sobhan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వర్షం’కు శోభన్ దర్శకత్వం వహించారు. ఒకే ఒక్క సినిమాతో శోభన్ తో ఏర్పడిన అనుబంధాన్ని ఇప్పటికీ ప్రభాస్ మర్చిపోలేదు. శోభన్ భౌతికంగా లేకపోయినా ఆయన కొడుకు, నటుడు సంతోష్ శోభన్ మూవీస్ ప్రమోషన్స్ ను అవకాశం ఉన్నంత మేరకు చేస్తూ వస్తున్నారు ప్రభాస్. సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సంతోష్ శోభన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ”ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేం ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ నేను గర్వపడి, నమ్మిన సినిమా. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించడం నా డ్రీమ్” అని అన్నారు. తన తండ్రి చనిపోయి 14 సంవత్సరాలు అయినా.. ఇప్పటికే సినిమా రంగంలోని అనేకమంది ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన కొడుకుగా తనను గౌరవించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందుకే మరింత కష్టపడి సినిమాలు చేయాలనే భావన తనకు కలుగుతుంద’ని సంతోష్ శోభన్ చెప్పారు.
‘ఏక్ మినీ కథ’కు కథను అందించిన మేర్లపాక గాంధీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, అప్పట్లోనే ఆయనతో ప్రయాణం కొనసాగించాలని అనుకున్నానని, ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడం సంతోషాన్ని కలిగించదని తెలిపాడు. ఈ సినిమా ఫస్ట్ ఛాయిన్ తానేనని మేర్లపాక గాంధీ చెప్పారని, దానిని తాను నమ్ముతున్నానని చెబుతూ, ”ఇందులో యూట్యూబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా” అని అన్నారు.
తన కొత్త సినిమాల గురించి వివరిస్తూ, ”డిసెంబర్ 21 నందిని రెడ్డి గారి సినిమా ‘అన్ని మంచి శకునములే’ వస్తోంది. అలాగే యువీ క్రియేషన్స్ లో ‘కళ్యాణం కమనీయం’ మూవీ చేశాను. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని వుంది. వ్యక్తిగతంగా నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం” అని సంతోష్ శోభన్ తెలిపాడు.