తెలుగునాట ఓ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా అన్నపూర్ణ వారి ‘ఇద్దరు మిత్రులు’ను పేర్కొంటూ ఉంటారు. అంతకు ముందు 1950లలోనే తెలుగులో ద్విపాత్రాభినయ చిత్రాలు రూపొందాయి. 1950లో తమిళ హీరో ఎమ్.కె. రాధా ద్విపాత్రాభినయం చేసిన ‘అపూర్వ సహోదరులు’ తొలి డ్యుయల్ రోల్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో మన భానుమతి కథానాయిక. తెలుగువారయిన సి.పుల్లయ్యనే దర్శకులు. ఆ తరువాత 1953లో ‘చండీరాణి’లో భానుమతి ద్విపాత్రాభినయం చేశారు. మరికొందరు కేరెక్టర్ యాక్టర్స్ సైతం డ్యుయల్ రోల్స్ లో అలరించారు. అందువల్ల ‘ఇద్దరు మిత్రులు’ను ఓ స్టార్ హీరో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రంగా పరిగణించవచ్చు. ఎప్పటికప్పుడు ఏయన్నార్ ను వైవిధ్యంగా చూపించాలని తపించేవారు అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు. అందులో భాగంగానే బెంగాల్ లో విజయవంతమైన చిత్రాలు, లేదా అక్కడి కథలను ఎంపిక చేసుకొని తెలుగులో సినిమాలు తీసేవారు. అలాగే ‘ఇద్దరు మిత్రులు’కు కూడా బెంగాలీ చిత్రం ‘తాషేర్ ఘర్’ ఆధారం. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1961 డిసెంబర్ 29న విడుదలై మంచి విజయం సాధించింది.
‘ఇద్దరు మిత్రులు’ కథ విషయానికి వస్తే- అజయ్ కోటీశ్వరుడు. విదేశాల్లో చదువుకుంటూ ఉంటాడు. అతని తండ్రి మరణించాడని తెలిసి స్వదేశం వస్తాడు. వారి మేనేజర్ అజయ్ ఆస్తి మొత్తం కొట్టేయాలని అప్పులు చూపిస్తాడు. వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక అజయ్ సతమతమవుతూ ఉంటాడు. అదే సమయంలో చదువుకొని నిరుద్యోగి అయిన విజయ్ పేదరికం వల్ల అవస్థలు పడుతూ ఉంటాడు. అతనికో పెళ్ళయిన చెల్లెలు ఉంటుంది. అవసరానికి నగలు అమ్ముకున్న కారణంగా ఆమె పుట్టింటిలోనే ఉండవలసి వస్తుంది. ఏం చేయాలో తోచని స్థితిలో విజయ్ ఉంటాడు. అనుకోకుండా అజయ్ కారు కింద పడతాడు. అచ్చు తనలా ఉన్న విజయ్ ను చూసి, అజయ్ ఆశ్చర్యపోతాడు. తనతో పాటు తీసుకువెళ్తాడు. ఒకరికొకరు తమ కథ చెప్పుకుంటారు. ధనవంతుడైన అజయ్ ను ఎవరైనా చంపేస్తారేమోనని అతని అత్త ఆందోళన. అందుకు తగ్గట్టుగానే మేనేజర్ భానోజీ ప్లాన్ వేస్తూంటాడు. దాంతో అజయ్ కు మనశ్శాంతి కరువవుతుంది. డబ్బున్నా సుఖం లేని అజయ్, ధనం లేక ఇబ్బంది పడుతున్న విజయ్ స్థానాలు మార్చుకుంటారు. అజయ్ అత్తకు కళ్ళు లేకపోయినా, ఇట్టే విజయ్ ని పసికడుతుంది. దాంతో తాము ఆడుతున్న నాటకం గురించి చెబుతారు. భానోజీ కూతురును ప్రేమించినట్టు నటిస్తూ అసలు విషయాలు కూపీలాగుతాడు విజయ్. అక్కడ విజయ్ కుటుంబాన్ని అతని స్థానంలో చక్కదిద్దుతాడు అజయ్. ఓ కార్ మెకానిక్ గా అజయ్ సాగుతూ ఉంటాడు. తనతో పనిచేసే అతని చెల్లెలిని ప్రేమిస్తాడు. భానోజీకి అసలు విషయం తెలిసి, విజయ్ ను మట్టు పెట్టాలనుకుంటాడు. అతని బండారం బయట పెడతాడు విజయ్. చివరకు కూతురు కూడా భానోజీని అసహ్యించు కుంటుంది. అజయ్ ఆస్తి అతనికి దక్కుతుంది. విజయ్ కి అందులో సగభాగమిస్తాడు అజయ్. కోరుకున్న అమ్మాయిలను పెళ్ళిచేసుకొని అత్తయ్యతో ఆనందంగా ఉంటారు అజయ్, విజయ్.
ఏయన్నార్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజసులోచన, ఇ.వి.సరోజ, శారద, జి.వరలక్ష్మి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య నటించారు. బెంగాలీ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ కథకు ఏ.సుబ్బారావు, కె.విశ్వనాథ్, గోరాశాస్త్రితో కలసి నిర్మాత మధుసూదనరావు సినిమా అనుకరణ రూపొందించారు. అలాగే కె.విశ్వనాథ్ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు మాటలు రాసిన ఈ చిత్రానికి శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, దాశరథి పాటలు రాశారు. ఎస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. దాశరథి తొలిసారిగా ఈ సినిమా కోసమే ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ…’ పాట రాశారు. అయితే ఆయన పాటతో తొలుత ‘వాగ్దానం’ చిత్రం విడుదలయింది. హీరో ద్విపాత్రాభినయం సీన్స్ లో సెల్వరాజ్ కెమెరా పనితనం భలేగా కనిపించింది. ఆయనకు ‘పాచు’ కెమెరామేన్ గా పనిచేశారు.
ఇందులోని “శ్రీరామా… నీ నామమెంతో రుచిరా…”, “నవ్వాలి నవ్వాలి…”, “ఓహో ఫ్యాషన్ల సీతాకోక చిలకా…”,”ఓహో ఓహో నిన్నే కోరెగా…”, “ఈ ముసి ముసి నవ్వులు…”, “హలో హలో అమ్మాయి…”, “ఖుషీ ఖుషీగా నవ్వుతూ…”, “పాడవేల రాధికా…”, “చక్కని చుక్కా సరసకు రావే…” వంటి పాటలు అలరించాయి. ‘ఇద్దరు మిత్రులు’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. రిపీట్ రన్స్ లో అలరించిన ఏయన్నార్ మూవీస్ లో ఒకటిగా ‘ఇద్దరు మిత్రులు’ నిలచింది.