Karthik Dandu: ఏప్రిల్ 21న విడుదలైన ‘విరూపాక్ష’ చిత్రం తొలి నాలుగు రోజుల్లో యాభై కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో మూవీ టీమ్ మొత్తం క్లౌడ్ నైన్ లో ఉంది. సంయుక్త మీనన్ కు తెలుగులో వరుసగా నాలుగో విజయం లభించగా, ‘రిపబ్లిక్’ తర్వాత దానిని మించిన హిట్ ను హీరో సాయిధరమ్ తేజ్ తన కిట్ లో వేసుకున్నాడు. తొలి చిత్రం ‘భమ్ బోలేనాథ్’తో పరాజయం చవిచూసిన దర్శకుడు కార్తీక్ దండు ఇప్పుడీ సినిమా విజయంతో ఫుల్ హ్యాపీ. ఈ సినిమా నిర్మాణం వెనుక జరిగిన కథ గురించి కార్తీక్ దండు ఆసక్తికరమైన విశేషాలను మీడియాకు వివరించాడు.
ఈ స్థారీ థాట్ గురించి మొదట చెబుతూ, “మా సినిమాలో దెయ్యం ఉండదు. అలా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే! నేను ఈ జోనర్‌కి చిన్నప్పటి నుంచీ పెద్ద ఫ్యాన్. ఈ జోనర్‌లో ఈ మధ్యకాలంలో హారర్ కామెడీలు వస్తున్నాయే తప్ప, స్ట్రిక్ట్ హారర్ మూవీస్ రావడం లేదనిపించింది. అందుకే తీద్దామనిపించి తీశాను. ఆరేడేళ్ళ క్రితం పేపర్‌లో ఆర్టికల్ చదివాను. గుజరాత్ లో ఓ మహిళ చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఓ చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు నాకు ఈ కథ రాద్దామని అనిపించింది నిజంగా ఆమెకు చేతబడి వచ్చి ఉంటే, వారందరూ చచ్చిపోయేవారేమో! సుకుమార్‌గారి దగ్గరకు వెళ్లడానికి ముందు చాలా చిన్న స్పాన్‌లో అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత సాయితేజ్, ప్రసాద్ గారిని ఆయన డిసైడ్ చేశారు. అక్కడి నుంచి అందరం కలెక్టివ్ డిసిషన్ తీసుకున్నాం. నా డ్రాఫ్ట్ అయ్యాక సుకుమార్‌గారి దగ్గరకు వెళ్లాక 6, 7 వెర్షన్లు స్క్రీన్‌ప్లేకి చేశాం. కథ మారలేదు కానీ ట్రీట్‌మెంట్ మారుతూ ఉండేది. అన్ని వెర్షన్లు రాసి బెస్ట్ చూజ్ చేసుకున్నాం” అని అన్నారు. సుకుమార్ ఇన్ పుట్స్ గురించి చెబుతూ, “క్లైమాక్స్ లో ఆడియన్స్ థ్రిల్ అయిన విషయాలు సుకుమార్‌గారు చేసిన మార్పులే. హారర్ అంటే దెయ్యాలే కాదు. మనకు వెన్నులో చలి పుట్టించేది ప్రతిదీ హారరే. ఆడియన్స్ కి కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో మర్డర్లు కూడా కొత్తగా డిజైన్ చేశాం” అని కార్తీక్ చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్, తదనంతర పరిణామాల గురించి చెబుతూ, “నా మొదటి సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే రైటింగ్‌లోనూ, మేకింగ్‌లోనూ నిలబడిపోవాలని అనుకున్నా. 2018 వరకు నేను నమ్మిన కథకు అవకాశం రాలేదు. దానికి కారణం, అప్పట్లో నేను కథ రాసుకున్నప్పుడు వేరే బడ్జెట్ ఉండేది. అప్పుడు నిర్మాతలు నన్ను నమ్మలేదు. ఆ టైమ్‌లో నన్ను నమ్మింది సుకుమార్‌గారే. డైరెక్టర్ ప్యాషన్, స్కిల్స్ అర్థం చేసుకోగలుగుతారనే నమ్మకం కలిగింది. నా నమ్మకం నిజమై ఈ కథ ఆయనకు నచ్చింది. అందుకే స్క్రీన్‌ప్లేని ఆయన కూర్చుని మార్చారు. మా కథకు నాలుగేళ్లు కరోనా బ్రేక్ వేసింది. అంతా కంప్లీట్ అయి సినిమా స్టార్ట్ చేయాలను కున్నాం. ముందురోజు అందరం కలిసి కూర్చున్నాం. మేమంతా ఫోన్లు సైలెంట్‌లోనో, వైబ్రేషన్ మోడ్ లోనూ పెట్టాం. షెడ్యూల్ డిస్కస్ చేస్తుండగా, ఒక్కసారి అన్ని ఫోన్లు రింగ్ అయ్యాయి. ఆఫీస్ బోయ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి ‘ఒకసారి అర్జెంటుగా టీవీ పెట్టండి’ అన్నాడు. న్యూస్‌లో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అని వచ్చింది. 22 రోజులు సాయితేజ్ హాస్పిటల్‌లో ఉన్నారు. నేను ఫిజికల్‌గా తిరుగుతున్నానేగానీ, నేను కూడా కోమాలో ఉన్నట్టే లెక్క. సాయితేజ్ సేఫ్ గా ఇంటికి వచ్చి, తిరుగుతారు అని చెప్పిన తర్వాత నేను రిలీఫ్ ఫీలయ్యాను. ఫస్ట్ షెడ్యూల్ కేవలం మూడు రోజులే ప్లాన్ చేశాం. అయితే ఆ మూడు రోజులు సాయిధరమ్ తేజ్ వీక్‌గా ఉన్నారు. చాలా సన్నగా అయ్యారు. సెట్స్ లో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు. రషెస్ చూసుకున్నారు. సెకండ్ షెడ్యూల్‌కి ఇంకా 10 రోజులు ఉండటంతో స్పీచ్ థెరపీ, డ్యాన్సు క్లాసులకు అటెండ్ అయ్యారు. ఆ షెడ్యూల్‌లో చాలా నార్మల్‌గా వర్క్ చేశారు” అని చెప్పారు.
తన తదుపరి సినిమా గురించి చెబుతూ, “రెండు మూడు ఐడియాలు ఉన్నాయి. ‘విరూపాక్ష’ జర్నీలోనే సుకుమార్ గారూ, నేనూ ఇంకో ఐడియా డిస్కస్ చేశాం. ఆయనకు కూడా నచ్చింది. నేను ఏ సినిమా చేసినా, నా స్ట్రెంగ్త్ హారర్, థ్రిల్లర్! సో అలాంటి సినిమానే చేస్తాను. ఈ సినిమా చూసి ఇండస్ట్రీ లో ‘దిల్’ రాజుగారితో పాటుగా చాలామంది నిర్మాతలు ఫోన్ చేశారు. అయితే నేనింకా ఎవరి దగ్గరా అడ్వాన్సులు తీసుకోలేదు” అని అన్నారు.