యాంగ్రీమెన్ రాజశేఖర్ హీరోగా నటించిన ‘శేఖర్’ సినిమా టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. హీరో రాజశేఖర్ తనకు డబ్బు ఇవ్వాలని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన పిటిషన్‌ను సోమవారం నాడు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో పాటు శేఖర్ సినిమా ప్రదర్శనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Tollywood: హీరోల్లో మార్పు వస్తుందా..? బడ్జెట్స్ తగ్గుతాయా..?
కొంతమంది ఉద్దేశపూర్వకంగా శేఖర్ సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించినట్లు జీవిత రాజశేఖర్, నిర్మాత తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం వెల్లడించనున్నారు. కాగా మే 20న ‘శేఖర్’ సినిమా విడుదల కాగా ఫైనాన్షియర్ పరంధామరెడ్డి పిటిషన్ మేరకు తొలుత ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. ఈ మేరకు హీరో రాజశేఖర్ కూడా ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టగా అది వైరల్ అయ్యింది. మరోవైపు ఈ సినిమా ప్రదర్శనలు కూడా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఇరు వర్గాల వాదనలు విన్న సిటీ సివిల్ కోర్టు సినిమా ప్రదర్శించుకోవచ్చని తీర్పు వెల్లడించింది.
కాగా భవిష్యత్‌లో ‘శేఖర్’ చిత్ర ప్రదర్శనపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి తాము మద్దతుగా నిలుస్తామని హీరో రాజశేఖర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. తమ వెన్నంటే ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు.