టాలీవుడ్ హీరోలలో మార్పు వస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం రావటం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ వెలిగిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అదంతా మేడిపండు చందం అని కొట్టి పడేస్తున్నారు అనుభవజ్ఞులు. అసలేం జరుగుతోంది అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం అన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అంటూ ఢంకా బజాయించి చెవులు హోరెత్తిస్తున్న సినిమాలు సైతం రియల్‌గా బాక్సాఫీస్ వద్ద అసలు వసూలు చేయలేక కుదేలు అవుతున్నాయి. ఆయా సినిమాలను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లను కదిలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
కానీ ఆయా సినిమాల హీరోలు, నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, దర్శకులతో ఉన్న అనుబంధం కారణంగా దానిని బయటకు వ్యక్తం చేయలేని స్థితి. తెగించి చేస్తే ఆ తర్వాత సినిమాల పంపిణీ హక్కులు దక్కవేమోనని పంపిణీదారులు, తమ థియేటర్లలో సినిమాలను ప్రదర్శనకు ఇవ్వరేమోనని ప్రదర్శనదారులు కుక్కిన పేనుల్లా ఉంటున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. చాలా సంస్థలో అంతర్మథనం మాత్రం మొదలైంది. ఇలాగే కాస్ట్ ఫెయిల్యూర్స్ ఇచ్చుకుంటూ పోతే చివరకి బోర్డు తిప్పి ఐపీ పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతాయనే భయం కనిపిస్తోంది. దీంతో కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి? అనే విషయమై చర్చోపచర్చలు మొదలు అయ్యాయి.
కథల ఎంపిక నుంచి బడ్జెట్ వరకూ అన్నింటిలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందనే సంగతిని అందరూ గుర్తెరిగారు. అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరనేది అర్థం కాని విషయం. ఎందుకంటే అసలు సినిమాల బడ్జెట్‌లో సింహభాగం హీరోలు, దర్శకుల పారితోషికాలే. వాటిలో కోత పెట్టే ధైర్యం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న నిర్మాతల్లో ఎవరికీ లేదనేది జగమెరిగిన సత్యం. అదే ప్రతిపాదన ఏ నిర్మాత అయినా తీసుకువస్తే చివరకు ఆ నిర్మాతే పక్కకు తప్పుకోవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఎంత బడ్జెట్ అయినా సినిమాలు తీయగలిగి ఉండే నిర్మాతలు సైతం హీరోలతో భాగస్వామ్యం పెట్టుకోవడం, దర్శకులు బిజినెస్‌లో వేలు పెట్టినా ‘నో’ అని చెప్పలేకపోవడం జరుగుతూ వస్తోంది. అలాగే తమ సినిమాలను ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని కూడా గట్టిగా చెప్పలేని నిస్సహాయులు మన నిర్మాతలు.
ఇక హీరోలు ఎన్నింటికి వస్తే అన్నింటికే షూటింగ్ మొదలు.. నో ప్రాపర్ కాల్షీట్స్ టైమింగ్స్. దీని వల్ల నిర్మాతకు అయ్యే వ్యయం అసలు బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ. దీనికి కారణం కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు లేకపోవడం… కేవలం కాంబినేషన్స్ సెట్ చేసుకుని హీరోలను కాకా పట్టే నిర్మాతలు ఎక్కువ కావటమే. ఆర్టిస్టులను శాసించే నిర్మాత చుక్కాని పెట్టి వెతికినా కనిపించరంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా కాస్ట్ ఎక్కడ నుంచి కంట్రోల్ చేయగలరు? మరి మార్పు సాధ్యమా? అంటే సాధ్యమే. కాకుంటే హీరోలకు వరుస దెబ్బలు తగలాలి. తగులుతున్నాయి కూడా. నిర్మాతలు హీరోల వెంట పరుగు ఆపాలి. అవసరం అయితే తామే హీరోలను, దర్శకులను తయారు చేయగలమనే ధైర్యం రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిర్మాతల్లో వచ్చిన రోజు హీరోలలోనూ మార్పు వస్తుంది. సినిమాల ఖర్చు తగ్గుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. ఆ మార్పు కోసం ఎదురు చూద్దాం.