‘House of the Dragon’ as prequel to ‘Game of Thrones’
విఖ్యాత ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ‘హెచ్.బి.ఓ’ వ్యూవర్ షిప్ ను విశేషంగా పెంచేసిన వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’. 2011 నుండి 2019 దాకా ఎనిమిది సీజన్స్ లో 73 ఎపిసోడ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అశేష జనాన్ని విశేషంగా అలరించింది. ఇప్పటి దాకా ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ స్థాయిలో పైరసీ అయిన మరో వెబ్ సిరీస్ ప్రపంచంలో కానరాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సిరీస్ కు ప్రీక్వెల్ గా ‘హౌస్ ఆఫ్ ద డ్రాగన్’ రూపొందింది. ఈ యేడాది ఆగస్టు 21 న ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ సీజన్ టీజర్ విడుదలయింది. పాత్రధారుల గెటప్స్ మొదలు, సెట్స్ అన్నీ కూడా ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ను గుర్తుకు తెస్తున్నాయి. టార్గేరియన్స్ వంశానికి చెందిన వారి జుట్టు బంగారు రంగులో మెరిసిపోయేలాగే కనిపిస్తూ ఉంది. ఇక ఆ వంశస్థులకు మాత్రమే సంబంధం ఉన్న డ్రాగన్స్ హంగామా ఇందులోనూ కనిపిస్తోంది.
జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్ రాసిన ‘ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్’ నవలల ఆధారంగా ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’ రూపొందింది. ఇప్పుడు మార్టిన్ కు తోడుగా ర్యాన్ జె.కాండల్ కూడా తోడయ్యారు. వారిద్దరూ కలసి ఈ ప్రీక్వెల్ రూపకల్పన చేశారు. ‘గేమ్ ఆఫ్ థ్రాన్స్’లోని కథ ఆరంభానికి రెండువందల సంవత్సరాల పూర్వం జరిగిన కథతో ఈ ప్రీక్వెల్ తెరకెక్కింది. ఇది డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. మరి ఈ సారి ఈ సిరీస్ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.