ప్రపంచీకరణతో సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఇప్పుడే కాదు ఎల్లలు లేని కళలు ఏ నాడో సాగరాలు దాటి సందడి చేస్తున్నాయి. ఈ సమయంలో మరింతగా కళలు కళకళలాడే పరిస్థితి ఏర్పడింది. సకల కళలకు వేదికగా నిలచిన సినిమా రంగం ఉత్తర, దక్షిణ – తూర్పు, పడమర భేదాలను తుడిచివేయనుందని పరిశీలకులు ఘోషిస్తున్నారు. ప్రపంచ సినిమాను శాసించిన ‘హాలీవుడ్’ చూపు ప్రస్తుతం భారతదేశం వైపు సాగుతోంది. ఇప్పుదే కాదు, తమ కళలకు, కథలకు అనువైన వాతావరణం కోసం హాలీవుడ్ పలుమార్లు భారతదేశంలో కాలుమోపింది. అయితే ఇప్పుడు ఏకంగా భారతీయ సినిమాల నిర్మాణంలో పాలు పంచుకోవడానికి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ‘సోనీ పిక్చర్స్’ సంస్థ భారతీయ సినిమాల నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నట్టు ఆ సంస్థ ప్రెసిడెంట్ శాన్ ఫోర్డ్ పానిచ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
భారతీయత అంటే ఆసక్తి!
గతంలో భారతీయ దర్శకనిర్మాతలు హాలీవుడ్ వెళ్ళి అక్కడి నిర్మాణ సంస్థలు, భారీ స్టూడియోస్ తో కలసి కొన్ని చిత్రాలు నిర్మించారు. కానీ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతీసంప్రదాయాలకు అందరూ పెద్ద పీట వేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతి పరిఢవిల్లడానికి వివేకానందుడు, పరమహంస యోగానంద వంటి యోగిపుంగవులు, ఇస్కాన్ వంటి సంస్థలు కృషి చేశాయి. భారతీయతపై ఆకర్షితులైన ఎందరో హాలీవుడ్ తారలు మన సంస్కృతిని ఆరాధించి, ఆనందించిన సంఘటనలూ ఉన్నాయి. జూలియా రాబర్ట్స్, మడోన్నా, సిల్వెస్టర్ స్టాలోన్, హ్యూ జాక్ మన్, క్లాయిడి సియెల్సా, రస్సెల్ బ్రాండ్ వంటివారు కొన్నేళ్ళ క్రితమే హైందవ సంప్రదాయంలోని గొప్పతనానికి ఆకర్షితులై మన దేశం సందర్శించారు. ఇక్కడి ఆధ్యాత్మిక గురువుల వద్ద శిష్యరికమూ చేశారు. స్టీవెన్ సీగల్, గోల్డీ జియన్నే హాన్ వంటి తారలు బుద్ధిజంవైపు మొగ్గు చూపించారు. బుద్ధుని జన్మస్థలమైన భారతదేశాన్ని వారెంతో పవిత్రగానూ భావించి, సందర్శించారు. ఇలా హాలీవుడ్ టాప్ స్టార్సే మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మన భారతీయ చిత్రాలు విరివిగా ప్రదర్శితమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులెందరో మన సంస్కృతిని గౌరవిస్తున్నారు. కొందరు అమెరికన్లు అదే పనిగా మన సినిమాల్లోని కట్టుబొట్టు చూడటానికి, వేషధారణ చూసి దానిని అనుసరించడానికి మన చిత్రాలను చూస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే భారతీయ సినిమాలకు పాశ్చాత్య దేశాల్లోనూ ఆదరణ ఉందని సోనీ పిక్చర్స్ సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా భారతీయ సినిమాలను విరివిగా నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆలోచించాలి!
సినిమాను ఓ పరిశ్రమగా గుర్తించాలని, ఇతర పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ధనసహాయం అందించాలనీ ఎప్పటి నుంచో మన సినీజనం ఆకాంక్షిస్తున్నారు. అది అభిలాషగానే ఉండి పోయింది. ఇతర పరిశ్రమలలో విదేశీ పెట్టుబడికి భారతదేశం అంగీకరిస్తున్న సమయమిది. ఈ నేపథ్యంలోనే భారతీయ చిత్రసీమలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే మరింత మేలురకమైన సినిమాలు రూపొందుతాయి. అంతేకాదు, పాశ్చాత్య దేశాల్లో మన భారతీయ సినిమా మరింతగా వెలుగులు విరజిమ్మే అవకాశాలు నెలకొంటాయి. దరిమిలా భారతదేశం ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. చిత్రసీమలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే మన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకొనే చర్యలు చేపట్టాలి. తద్వారా చిన్న సినిమాలకు అండగా నిలిచే ‘నేషనల్ ఫిలిమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్’ వంటి సంస్థలకు నిధులు సమకూర్చే సదుపాయమూ దక్కుతుంది. అప్పుడు మరెందరో సినీఔత్సాహికులకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ దిశగా సినీజనం, ప్రభుత్వాలు ఆలోచిస్తే సినిమా పరంగానూ దేశ ఆర్థిక పరిస్థితిని కొంతయినా చక్కదిద్దుకొనే వెసలుబాటు కలుగుతుంది.
ఒకప్పుడు మన దేశంలోనే ఉత్తర భారతీయ చిత్రాలు, దక్షిణ భారతీయ సినిమాలు అనే భేదం కనిపించేది. ప్రస్తుతం దక్షిణాది నుండి బయలు దేరిన ‘పాన్ ఇండియా మూవీస్’ ఈ తేడాలను చెరిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది చలనచిత్ర నిర్మాతలు, దక్షిణాది సినిమా ప్రొడ్యూసర్స్ కలసి కట్టుగా చిత్రాలను నిర్మించి, మన భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వెలిగేలా చేయవచ్చు. ఆ దిశగా ఇప్పటికే కొందరు సౌత్ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్, నార్త్ మూవీ మేకర్స్ అడుగులు వేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళు విదేశీ పెట్టుబడులనూ సమయోచితంగా వినియోగించుకొని, ప్రపంచ సినీ అభిమానులు మెచ్చే నాణ్యమైన చిత్రాలను అంత్యత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించవచ్చు. ఒకప్పుడు హాలీవుడ్ సినిమా ఎన్నికోట్లు ఖర్చుపెట్టి తీసినా, ప్రపంచవ్యాప్తంగా సదరు చిత్రాలకు ఆదరణ ఉండేది కావున, ఫ్లాప్ టాక్ వచ్చినా భారీ నష్టాల నుండి తప్పుకొనే వీలుండేది. అయితే జనం మెచ్చే కథ, కథనంతో తీసిన హాలీవుడ్ మూవీస్ ప్రపంచ వ్యాప్తంగా జయకేతనం ఎగురవేసి, పెట్టిన పెట్టుబడికంటే ఎన్నో రెట్లు లాభాలు ఆర్జించిన విషయాన్ని మరువరాదు. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ‘అవతార్’ సినిమా 13 ఏళ్ళ క్రితమే వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అందులోని కథావస్తువు మన రామాయణాన్ని పోలివుండడం, పాత్రల వేషధారణ సైతం మన పురాణగాథలను గుర్తు చేయడం గమనార్హం! అందువల్ల మన సినీజనం భారతీయత ఉట్టిపడే కథలు, కథనాలతో సిద్ధమై విదేశీ పెట్టుబడులతోనూ దేశవిదేశాల్లోని సినీఫ్యాన్స్ ను ఆకట్టుకొనే చిత్రాలు నిర్మిస్తే “జయ్ హో…” అంటూ విజయ గీతాలు పాడుకోవచ్చు.
