కరోనా సెకండ్ వేవ్ నుంచీ ఇంకా దేశం పూర్తిగా కొలుకోలేదు. చాలా రంగాల్లో పనులు మొదలైనప్పటికీ థియేటర్లు మాత్రం మూతపడే ఉంటున్నాయి. కాకపోతే, హిందీ, ఇంగ్లీష్ సినిమాలకు ప్రధానమైన మార్కెట్లు… ముంబై, ఢిల్లీ నగరాలు. ఈ రెండూ చోట్లా ఇంత కాలం థియేటర్లు తెరుచుకోలేదు. కానీ, ప్రస్తుతం దేశ రాజధానిలో 50 శాతం ప్రేక్షకులతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఆర్దిక రాజధాని ముంబైలో మాత్రం బిగ్ స్క్రీన్స్ ఇంకా వెలవెలబోతున్నాయి. ముంబై మార్కెట్లో సినిమా విడుదల చేసే స్థితి ఇంకా లేకున్నా చాలా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అయిపోతున్నాయి.
మరీ ముఖ్యంగా, ‘ద సూసైడ్ స్క్వాడ్’ సినిమా ఆగస్ట్ 5న భారతీయుల ముందుకి రానుంది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే… అమెరికాలో ఆగస్ట్ 6న జనం ముందుకి చిత్రాన్ని తీసుకెళుతున్నారు. అంటే, యూఎస్ లో కంటే ఒక రోజు ముందే మనం ‘ద సూసైడ్ స్క్వాడ్’ చూడబోతున్నాం అన్నమాట! కేవలం ‘ద సూసైడ్ స్క్వాడ్’ మాత్రమే కాదు ఇంకా పలు హాలీవుడ్ చిత్రాలు తమ విడుదల తేదీలు నిర్ణయించేసుకుంటున్నాయి. జూలై 30న ‘మోర్టల్ కాంబాట్’, ఆగస్ట్ 13న ‘ద కాన్ జ్యూరింగ్’ సినిమాలు పెద్ద తెర మీదకు వచ్చేస్తున్నాయి. ఈ లోపు ముంబై కూడా పూర్తిగా రీ ఓపెన్ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ లాంటి క్రేజీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్దకి క్యూ కడతాయి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్…