నగుమోము నగ్మా తన నగిషీల మహిమతో తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎంతోమంది రసికాగ్రేసరుల కలల సామ్రాజ్యానికి రాణిగా పట్టాభిషిక్తురాలయింది. నాజుకు సోకులతో అలరించడమే కాదు, బరువు పెరిగినా దరువు వేస్తూ సక్సెస్ రూటులో సాగిపోయింది నగ్మా. తెలుగులోనే కాదు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళ, భోజ్ పురి, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ నగ్మా తనదైన బాణీ పలికించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది.
నగ్మా అసలు పేరు నందితా అరవింద్ మొరార్జీ. 1974 డిసెంబర్ 25న బొంబాయిలో జన్మించిందామె. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ బిజినెస్ మేన్. తల్లి పేరు సీమా. ఆమె అసలు పేరు షమా ఖాజీ. నగ్మా పుట్టిన కొద్ది రోజులకే ఆమె కన్నవారు విడిపోయారు. తరువాత తల్లి చందర్ సాదనా అనే సినిమా నిర్మాతను పెళ్ళాడింది. ఆయన ద్వారా షమాకు జ్యోతిక, రాధిక జన్మించారు. జ్యోతిక కూడా నగ్మాలాగా నటి. ఆమె తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్ళాడారు. ఇక రాధిక రోషిణి పేరుతో “మాస్టర్, పవిత్ర ప్రేమ” వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. నగ్మా సవతి తండ్రి సినిమా నిర్మాత కావడంతో ఆమె కూడా నటనపై ఆసక్తి పెంచుకుంది. ఆరంభంలో నగ్మా సాదనాగానే ఆమె పరిచయమయింది. సల్మాన్ ఖాన్ కథ రాసి, నటించిన ‘బాఘీ’తో నగ్మా చిత్రసీమలో అడుగు పెట్టింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం సుమన్ హీరోగా రూపొందిన ‘పెద్దింటల్లుడు’. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత తెలుగునాట నగ్మా హవా విశేషంగా వీచింది. ఆమె తన అందచందాలతో ఆ నాటి రసికులకు బంధాలు వేసింది.
చిరంజీవి సరసన నగ్మా “ఘరానామొగుడు, ముగ్గురు మొనగాళ్ళు, రిక్షావోడు” చిత్రాల్లో నటించింది. బాలకృష్ణకు జోడీగా ‘అశ్వమేధం’లో తళుక్కుమంది. నాగార్జున జంటగా “కిల్లర్, అల్లరి అల్లుడు, వారసుడు” చిత్రాల్లో మురిపించింది. వెంకటేశ్ తో “కొండపల్లి రాజా, సూపర్ పోలీస్, సరదాబుల్లోడు” సినిమాల్లో సందడి చేసింది. మోహన్ బాబుతో ‘మేజర్ చంద్రకాంత్’లోనూ, సుమన్ తో ‘పెద్దింటి అల్లుడు, రెండిళ్ల పూజారి’లోనూ, రాజశేఖర్ తో ‘గ్యాంగ్ మాస్టర్, ఆవేశం” చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. శోభన్ బాబుతో ‘అడవిదొర’లో నటించింది. సి.ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ‘మౌనం, సూర్యపుత్రులు’లోనూ నగ్మా ముఖ్యపాత్రలు ధరించింది. ‘అల్లరి రాముడు’లో జూనియర్ యన్టీఆర్ కు అత్త పాత్రలో కనిపించింది. తరువాత ‘నిను చూడక నేనుండలేను’లోనూ నగ్మా కీలక పాత్ర పోషించింది. ఆమె నటించిన ఇతర భాషా చిత్రాలు సైతం డబ్బింగ్ రూపంలో తెలుగువారిని అలరించాయి.
నగ్మాకు రాజకీయాలపైనా ఆసక్తి కలిగింది. బీజేపీ ఆమెకు ఎర్రతివాచీ పరచినా, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ పార్టీ తరపున 2014లో మీరట్ లోక్ సభనుండి పోటీ చేసి పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ కు ఆమె ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.