He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!

Heman

Heman

హాలీవుడ్ విజువల్ వండర్ ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లీష్ ట్రైలర్‌తో ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా రిలీజ్ చేసిన తెలుగు ట్రైలర్‌తో టాలీవుడ్ ఆడియన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి సినిమాలతో పాన్-ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ అయిన ‘హీ-మ్యాన్’ (ప్రిన్స్ ఆడమ్) పాత్రకు నిఖిల్ తన పవర్‌ఫుల్ వాయిస్‌ను అందించారు. ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ ఐకానిక్ క్యారెక్టర్‌కు ఆయన గాత్రం తోడవ్వడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్‌లో నిఖిల్ బేస్ వాయిస్ ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిఖిల్ మాత్రమే కాకుండా.. ఈ హాలీవుడ్ చిత్రానికి మన టాలీవుడ్ ప్రముఖుల వాయిస్ అదనపు బలాన్ని చేకూర్చింది. పవర్‌ఫుల్ విలన్ ‘స్కెలెటర్’ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గంభీరమైన గాత్రాన్ని అందించగా, ‘డంకన్’ పాత్రకు వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్ డబ్బింగ్ చెప్పారు. ఈ స్ట్రాంగ్ వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని ఫాంటసీ, యాక్షన్ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు మరింత నాచురల్‌గా, దగ్గరగా కనెక్ట్ కానున్నాయి. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. నికోలస్ గలిట్జైన్ (హీ-మ్యాన్‌), కమిలా మెండెస్ (టీలా) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జారెడ్ లెటో (స్కెలెటర్), ఇడ్రిస్ ఎల్బా (మ్యాన్-అట్-ఆర్మ్స్) వంటి హాలీవుడ్ దిగ్గజాలు నెగెటివ్ అండ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అలిసన్ బ్రి, మొరెనా బక్కారిన్, క్రిస్టెన్ విగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త తరానికి ‘హీ-మ్యాన్’ ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ను సోనీ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయంగా పంపిణీ చేస్తోంది. ఈ జూన్ 5వ తేదీన ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం భారత దేశ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది.