(ఫిబ్రవరి 19న కోన వెంకట్ పుట్టినరోజు)
చదువుల తల్లి దయ ఉండాలే కానీ, రచనలు చేయవచ్చు. పదాలతో పదనిసలు పలికించవచ్చు. పదవిన్యాసాలతో మురిపించవచ్చు. పదబంధాలతో మైమరిపించవచ్చు. లక్ష్మీకటాక్షంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగు పెట్టిన కోన వెంకట్, తరువాత సరస్వతీ కరుణతో కలం పట్టి కదం తొక్కారు. ఆ పై పలు వినోదాల తేరులను తన పదబంధాలతో పరుగులు తీయించారు. తరువాత నటునిగానూ అలరించారు.
కోన వెంకట్ 1965 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఓ నాటి నటులు, తరువాత రాజకీయాల్లో రాణించిన కోన ప్రభాకర రావు మనవడే కోన వెంకట్. ఈయనను కూడా తాత ప్రభాకర్ రావు లాగే చిత్రసీమ ఆకర్షించింది. దాంతో తమ కుటుంబానికి పరిచయం ఉన్న ప్రముఖ రచయిత ఆత్రేయతో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఆయనతో కలసి తిరగడం వల్ల చిత్రసీమలోని సాధకబాధకాలు ఇట్టే తెలుసుకున్నారు. వినోదం పంచే చిత్రాలను రూపొందించాలనే లక్ష్యంతో ప్రముఖ హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ సినిమాను నిర్మించారు. తొలి చిత్రం నిరాశ పరచింది. అయినా, పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావించి, చిత్రసీమలోనే సాగారు. ఆ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడం, ఆయన ప్రోత్సాహంతో కోన వెంకట్ రచయితగా మారారు. రాము హిందీలో తెరకెక్కించిన “సత్య” చిత్రం తెలుగు వర్షన్ కు కోన వెంకట్ మాటలు రాశారు. అలాగే హిందీ నుండి తెలుగులోకి అనువాదమైన “దిల్ సే, కౌన్, మస్త్, జంగిల్, కంపెనీ” చిత్రాలకూ అనువాద రచనలో పాలు పంచుకున్నారు.
రసూల్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఒకరికి ఒకరు’ సినిమాతోనే కోన వెంకట్ కు రచయితగా గుర్తింపు లభించింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’తో మంచి ఆదరణ దక్కింది. “శివమణి, వెంకీ, సాంబ, బాలు, భగీరథ, చుక్కల్లో చంద్రుడు, షాక్” చిత్రాలకూ రచన చేశారు వెంకట్. శ్రీను వైట్ల ‘ఢీ’తో రచయితగా కోన వెంకట్ కు మరింత పేరు లభించింది. ఆపై “రెడీ, చింతకాయల రవి, కింగ్, అదుర్స్, బాద్ షా, అఖిల్, బ్రూస్లీ, జై లవకుశ, నిశ్శబ్దం” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు.
1997లో ‘తోకలేని పిట్ట’ నిర్మించి, నష్ట పోయినా, మళ్ళీ 2014లో ‘గీతాంజలి’తో నిర్మాణంలో అడుగు పెట్టారు కోన వెంకట్. తరువాత “శంకరాభరణం, అభినేత్రి, సాహసమే శ్వాసగా సాగిపో, నిన్నుకోరి, నీవెవరో, నిశ్శబ్ధం, గల్లీ రౌడీ” చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన ‘ఎందుకంటే… ప్రేమంట!’ సినిమాలో విలన్ గానూ నటించారు కోన వెంకట్. 2008లో ‘నేను తను ఆమె’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న కోన వెంకట్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ మరింతగా వినోదం పంచుతారని ఆశిద్దాం.