(మార్చి 19న నటనిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు)
విలక్షణమైన అభినయానికి మారుపేరుగా నిలిచారు డాక్టర్ ఎమ్.మోహన్ బాబు. ఆయన కెరీర్ గ్రాఫ్ లో ఉవ్వెత్తున ఎగసి, ఉస్సూరుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. పలు ఎత్తులు, పల్లాలు చూశారాయన. అసలు తెలుగునాట అలాంటి ఆటుపోట్లు మరో స్టార్ కు ఎదురు కాలేదని చెప్పవచ్చు. అన్నిటినీ చిరునవ్వుతో గెలుచుకుంటూ ముందుకు సాగారు మోహన్ బాబు. 500పై చిలుకు చిత్రాల్లో నటించి, ఈ నాటికీ నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ఆయన అభినయంలోని వైవిధ్యం తెలుగువారిని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది.
చిత్తూరు జిల్లాలోని మోదుగు పాలెంలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించారు. ఆయన తండ్రి ఓ పాఠశాల పంతులు. ఇంట్లో పెద్దవాడు మోహన్ బాబు. ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. తమ్ముళ్ళు ,చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి సంపాదించే జీతంతోనే ఇల్లు గడవడం కష్టమని భావించారు. దాంతో ప్లస్ టూ పాస్ కాగానే, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ తీసుకున్నారు. మద్రాసు వెళ్ళి అక్కడ ఓ పేరున్న ఉన్నత పాఠశాలలో పి.ఇడి.గా పనిచేశారు. అక్కడ ఆయనను కులవివక్ష కలచివేసింది. ఆ సమయంలోనే భవిష్యత్ లో కులం అన్న మాట లేకుండా ఉండే పాఠశాలలో పనిచేయాలని భావించారు. ఆ పాఠశాల నుండి బయటకు వచ్చాక సినిమా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. దర్శకుడు కావాలనుకున్నారు. కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అలా సాగుతున్న భక్తవత్సలం నాయుడు జీవితాన్ని దాసరి నారాయణరావు రూపొందించిన ‘స్వర్గం-నరకం’ (1975) చిత్రం మలుపు తిప్పింది. అందులో నెగటివ్ షేడ్స్ రోల్ లో కనిపించి, తరువాత ఇల్లాలు అంటే గౌరవం పెంచుకొనే పరివర్తన చెందిన పాత్ర పోషించారు. ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా పరిచయం అయ్యారు. ఆ తరువాత నుంచీ దాసరి నారాయణరావు రూపొందించిన పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ అనతికాలంలోనే అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆ పైన బాపు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులు సైతం మోహన్ బాబుకు తగిన పాత్రలు ఇచ్చారు. ఆ రోజుల్లో విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మోహన్ బాబు పలు పాత్రలు పోషించారు. మోహన్ బాబు ఉన్నాడంటే చాలు, ఆయన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని ప్రేక్షకులు భావించేలా చేసుకున్నారు.
దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘సర్దార్ పాపారాయుడు’లో మోహన్ బాబు ‘పప్పారాయుడు…పప్పారాయుడు…’ అంటూ బ్రిటిష్ దొరగా కాసేపు కనిపించి సందడి చేశారు. మోహన్ బాబులోని విలక్షణతను గుర్తించిన ఆయన గురువు దాసరి నారాయణరావు, ‘కేటుగాడు’ చిత్రంతో హీరోని చేశారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన మోహన్ బాబుకు, అవేవీ అంతగా అలరించలేదు. దాంతో సొంతగా ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ‘ప్రతిజ్ఞ’ చిత్రాన్ని నిర్మించి, నటించారు. అప్పటి నుంచీ మోహన్ బాబు తన సొంత సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తూ హీరోగా సాగారు. అయితే మధ్యలో మళ్ళీ ఆయనను పరాజయాలు పలకరించాయి. అప్పుడు మళ్ళీ తనదైన అభినయంతో అలరించసాగారు. ముఖ్యంగా ఆ సమయంలో కామెడీ విలన్ గా మోహన్ బాబు విజయయాత్ర చేశారు. ఇక తన బ్యానర్ లో తాను హీరోగా కాకుండా, ఇతరులతో చిత్రాలు నిర్మించాలని భావించారు. ఆ సమయంలోనే మళయాళంలో ఘనవిజయం సాధించిన ‘చిత్రం’ సినిమాను రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్నారు. వేరే హీరోను పెట్టి, తాను నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు. అది వర్కవుట్ కాలేదు. దాంతో సన్నిహితుల సలహా మేరకు మళ్ళీ తానే హీరోగా మేకప్ వేసుకొని నటించారు. ఆ చిత్రమే ‘అల్లుడుగారు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడుగారు’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళీ తన సొంత సంస్థలో చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగారు.
‘అల్లుడుగారు’ తరువాత ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్ళాం’ వంటి చిత్రాలతోనూ మోహన్ బాబు నటనిర్మాతగా ఘనవిజయాలను చవిచూశారు. ఆ సినిమాలతో స్టార్ గా సక్సెస్ రూటులో సాగిపోయారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన ‘అల్లరి మొగుడు’ కూడా అనూహ్య విజయం సాధించింది. ఇటు సొంత చిత్రాలతోనూ, అటు బయటి సినిమాల్లోనూ మోహన్ బాబు హీరోగా విజయభేరీ మోగించారు. అదే సమయంలో మహానటుడు యన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’ నిర్మించారు. యన్టీఆర్ చివరి చిత్రంగా ‘మేజర్ చంద్రకాంత్’ రూపొందింది. ఆ సినిమా కూడా అఖండ విజయం సాధించింది. యన్టీఆర్ తాను నాల్గవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగానే, మోహన్ బాబును రాజ్యసభకు పంపారు. అదే యేడాది మోహన్ బాబు నటించి, నిర్మించిన ‘పెదరాయుడు’ అఖండ విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలచింది. ఆ తరువాత కూడా పలు వైవిద్యమైన చిత్రాలు నిర్మించి అలరించారు. మనదేశంలో నటనిర్మాతగా అత్యధిక చిత్రాలు నిర్మించిన ఘనత మోహన్ బాబు సొంతం. దాదాపు నలభైకి పైగా చిత్రాలు నిర్మించి, నటించారాయన. ఆ రికార్డు ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది.
ఒక బడిపంతులు తనయునిగా, ఒకప్పుడు పాఠశాలలో పి.ఇడి.గా పనిచేసిన అనుభవంతో మోహన్ బాబు ‘శ్రీవిద్యా నికేతన్’ ఏర్పాటు చేశారు. తాను పనిచేసిన పాఠశాలలో కులవివక్షకు గురైన మోహన్ బాబు తాను నెలకొల్పిన విద్యాలయంలో అలాంటి ప్రస్తావనే లేకుండా కులమతాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూసే ఆదర్శ విద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ విద్యాలయం నేడు ఉన్నత విద్యలకు కూడా నెలవుగా మారింది. తెలుగునేలపై అత్యుత్తమ విద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. కొందరు పేదవిద్యార్థులకు తన పాఠశాలలో విద్యాదానం కూడా చేస్తున్నారాయన.
మోహన్ బాబు సంతానం సైతం నటనకే అంకితమయ్యారని చెప్పవచ్చు. కూతురు మంచు లక్ష్మి, తనయులు విష్ణు, మనోజ్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ నటనలో రాణిస్తున్నారు. అలాగే తండ్రిలాగే తమ అభిరుచికి తగ్గ చిత్రాలకూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు ఎంచక్కా తన మనవడు, మనవరాళ్ళతో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. తన దరికి చేరిన విలక్షణమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన సూర్య చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’లో ఓ వైవిధ్యమైన పాత్ర ధరించి అలరించారు మోహన్ బాబు. ఈ మధ్యే ‘సన్నాఫ్ ఇండియా’గానూ జనం ముందుకు వచ్చారు. ఆయన మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.