(డిసెంబర్ 19న గోవింద్ నిహలానీ పుట్టినరోజు)
కాలంతో పాటు పయనించలేనివారు కొందరు. కాలానికి అనుగుణంగా నడిచేవారు మరికొందరు. కాలంతో సమానంగా పరుగు తీసేవారు ఇంకొందరు. కాలాన్ని తమ వెనుక పరుగెత్తేలా చేసేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వారిలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ గోవింద్ నిహలానీ తప్పకుండా ఉంటారు. గోవింద్ నిహలానీ చిత్రాలను చూస్తే, ఆయన ఆలోచనలు కాలానికి సవాల్ విసరుతూ ఎంతో ముందుగా ఉండేవని ఇట్టే తెలిసిపోతుంది.
గోవింద్ నిహలానీ 1940 డిసెంబర్ 19న కరాచీలో జన్మించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం దేశవిభజన సమయంలో అటు నుండి ఇటుగా వచ్చారు నిహలానీ కుటుంబీకులు. బెంగళూరులో గోవింద్ నిహలానీ సినిమాటోగ్రఫీలో డిగ్రీ అందుకున్నారు. బెంగళూరులోనే తెలుగువారయిన ప్రఖ్యాత కెమెరామేన్ వి.కె.మూర్తి ఉండేవారు. అదే ప్రాంతానికి చెందిన గురుదత్, వి.కె.మూర్తి సినిమాటోగ్రఫీతో పలు చిత్రాల్లో మాయ చేశారు. వి.కె.మూర్తి వద్ద గోవింద్ నిహలానీ అసిస్టెంట్ గా పనిచేశారు. గురుదత్ కు సమీపబంధువైన తెలంగాణ బిడ్డ శ్యామ్ బెనెగల్ తో గోవింద్ నిహలానీకి పరిచయమయింది. శ్యామ్ బెనెగల్ తొలి చిత్రం ‘అంకుర్’ మొదలు “నిశాంత్, మంథన్, భూమిక, కొండుర, జునూన్, కలియుగ్, ఆరోహణ్” చిత్రాల దాకా గోవింద్ నిహలానీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రాలన్నీ విశేషాదరణ చూరగొన్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. తరువాత ‘ఆక్రోశ్’ చిత్రంతో గోవింద్ నిహలానీ దర్శకునిగా మారారు.
గోవింద్ తెరకెక్కించిన “విజేత, అర్ధ్ సత్య, పార్టీ, అఘాత్, తమస్, దృష్టి, రుక్మావతి కీ హవేలీ, ద్రోహ్ కాల్, హజార్ చౌరసీకీ మా, తక్షక్, దేహమ్, దేవ్” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్నారు గోవింద్. ఆయన చిత్రాలు అనేకం జాతీయ స్థాయిలో అలరించాయి. కొన్ని జాతీయ అవార్డులూ సాధించాయి. శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ‘జునూన్’ చిత్రం గోవింద్ నిహలానీకి జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా అవార్డు సంపాదించి పెట్టింది. ఇక గోవింద్ తెరకెక్కించిన “ఆక్రోష్, అర్ధ్ సత్య, దృష్టి, హజార్ చౌరసీకీ మా” చిత్రాలు ఉత్తమ హిందీ సినిమాలుగా జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. గోవింద్ తెరకెక్కించిన ‘ద్రోహ్ కాల్’ చూసి, కమల్ హాసన్ ఎంతో ముచ్చటపడి దానిని తమిళ, తెలుగు భాషల్లో రూపొందించారు. అదే ‘ద్రోహి’. ఇక గోవింద్ నిహలానీ 1999లో రూపొందించిన ‘తక్షక్’ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, కమర్షియల్ ఫార్మాట్ లోనూ తనదైన బాణీ పలికించారాయన. 2001లో తెరకెక్కించిన ‘దేహం’ 2022 సంవత్సరంలో జరిగే కథతో ఫ్యూచరిస్టిక్ గా రూపొంది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2019లో నిహలానీ ‘అప్ అప్ అండ్ అప్’ అనే 3డి మూవీ తెరకెక్కించారు. ఈ సినిమా తరువాత విశ్రాంతి తీసుకుంటున్నారు. 80 ఏళ్ళు దాటినా, గోవింద్ ఆలోచనలు ఇప్పటికీ కుర్రాళ్ళతో పోటీ పడుతూ సాగుతుంటాయని సన్నిహితులు చెబుతారు. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.