(మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టినరోజు)
ఆమిర్ ఖాన్ ఏది చేసినా, ఓ నిబద్ధతతో చేస్తారు. అందుకే ఆయనను అందరూ ‘మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్’ అని కీర్తిస్తారు. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా, పాటగాడిగా చిత్రసీమలో సాగిన ఆమిర్ బుల్లితెరపై కూడా ‘సత్యమేవ జయతే’ వంటి కార్యక్రమాన్ని నిర్వహించి జనం మదిని దోచారు. ఆమిర్ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తిగా సాగారు. బాలీవుడ్ సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్నారు. బుల్లితెరపైనా తన బాణీ పలికించాడు. కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేసి వేడి రాజేశారు. ఏది చేసినా ఆమిర్ పర్ ఫెక్ట్ గా చేస్తారనే పేరు సంపాదించారు.
మొహమ్మద్ ఆమిర్ హుసేన్ ఖాన్ 1965 మార్చి 14న జన్మించారు. ఆమిర్ ఖాన్ తండ్రి తాహిర్ హుసేన్ హిందీ చిత్రరంగంలో నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడుగా రాణించారు. తాహిర్ అన్న నాసిర్ హుసేన్ సైతం చిత్రసీమలో ఎంతో పేరెన్నికగన్న నిర్మాత, దర్శకుడు. తాహిర్ నిర్మాతగా రూపొందిన “కారవాన్, అనామిక, మద్ హోష్, తుమ్ మేరే హో” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఇక ఆయన అన్న నాజిర్ హుసేన్ నిర్మించిన “తుమ్ సా నహీ దేఖా, దిల్ దేఖే దేఖో, జబ్ ప్యార్ కిసీసే హోతా హై, ఫిర్ వొహీ దిల్ లాయా హూ, బహారోంకే సప్నే, ప్యార్ కా మౌసమ్, యాదోంకీ బారాత్, హమ్ కిసిసే కమ్ నహీ, జమానే కో దిఖానా హై, జబర్దస్త్” చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. వారి వారసుడిగా ఆమిర్ సైతం నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రజ్ఞను చాటుకుంటున్నారు. 1973లో ఆమిర్ పెదనాన్న నాజిర్ హుసేన్ నిర్మించి, దర్శకత్వం వహించిన ‘యాదోంకీ బారాత్’ చిత్రంలో చిన్నప్పటి తారిక్ పాత్రలో నటించాడు ఆమిర్ ఖాన్. ఈ చిత్రం తెలుగులో యన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’గా రూపొందింది. ‘యాదోంకీ బారాత్’లో నటించినప్పటి నుంచీ ఆమిర్ ఖాన్ కు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉండేది. పందొమ్మిదేళ్ళ వయసులో ‘హోళీ’లో నటించాడు ఆమిర్. ఆ సినిమా తరువాత ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో హీరోగా పరిచయమయ్యాడు ఆమిర్ ఖాన్. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడంతో ఆమిర్ ఖాన్ బాలీవుడ్ లో కుదురుకున్నాడు.
తొలి చిత్రం ‘ఖయామత్ సే ఖయామత్ తక్’తో లవర్ బోయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఆమిర్. ఆ తరువాత వరుసగా కొన్ని ప్రేమకథా చిత్రాల్లో నటించాడు. “జో జీతా వహీ సికందర్, దిల్, రంగీలా, గులామ్, సర్ఫరోష్” వంటి సూపర్ హిట్స్ లో నటించిన తరువాత ఆమిర్ ఖాన్ ‘లగాన్’తో నిర్మాతగా మారాడు. స్వతంత్ర భారతానికి పూర్వపు వాతావరణంలో రూపొందిన ‘లగాన్’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ సంపాదించడం విశేషం. అప్పటి నుంచీ ఆమిర్ ఖాన్ ఇతరుల చిత్రాలలో నటిస్తూనే, నిర్మాతగా తన అభిరుచికి తగ్గ సినిమాల్లో నటిస్తూ సాగాడు.
మన తెలుగు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ‘గజిని’ చిత్రంలో నటించి ఎంతగానో అలరించాడు ఆమిర్. మన దేశంలో వంద కోట్ల క్లబ్ కు తెరతీసిన తొలి చిత్రంగా ‘గజిని’ నిలచింది. ఆమిర్ నిర్మాతగానే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించాడు. స్వీయ దర్శకత్వంలో ఆమిర్ తీసిన ‘తారే జమీన్ పర్’ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. ఇక బాలీవుడ్ లో రోజు రోజుకూ ఆమిర్ క్రేజ్ పెరగసాగింది. ఆయన నటించిన “త్రీ ఇడియట్స్, , ధూమ్ -3, పీకే, దంగల్” చిత్రాలన్నీ కోట్లాది రూపాయలు కొల్లగొట్టి టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి. అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లోనే కాదు, జపాన్, చైనా వంటి దేశాల్లోనూ ఆమిర్ చిత్రాలు విశేషాదరణ చూరగొనడం మరింత విశేషం. 2018లో ఆమిర్, అమితాబ్ బచ్చన్ తో కలసి నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అట్టర్ ఫ్లాప్ అయింది. వరుస విజయాల తరువాత ఆమిర్ ఆ అపజయంతో నిరాశకు లోనయ్యాడు. ప్రస్తుతం ‘లాల్ సింగ్ ఛద్దా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. టామ్ హ్యాంక్స్ నటించిన ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మన తెలుగు నటుడు నాగచైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి రాబోయే ‘లాల్ సింగ్ ఛద్ధా’తో ఆమిర్ ఏ తీరున ఆకట్టుకుంటారో చూడాలి.