Hansika Motwani To Marry Her Boyfriend In December: నటి హన్సిక మోత్వానీ ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని, అతడ్ని పెళ్లి కూడా చేసుకోబోతోందని ఇదివరకే వార్తలొచ్చాయి. సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారితో చాలాకాలం నుంచి డేటింగ్ చేస్తోందని, ఒక కంపెనీలో వీళ్లు భాగస్వాములు కూడా ఉన్నారని తెలిసింది. అటు బిజినెస్ పార్ట్నర్‌లు కావడంతో పాటు తమ అభిరుచులు కూడా కలవడంతో.. పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు వీళ్ల పెళ్లికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
డిసెంబర్ 4వ తేదీన హన్సిక తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడబోతోందని ఒక ప్రముఖ పోర్టల్ వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయని, అదే రోజు రాత్రి సుఫీ నైట్ నిర్వహించనున్నారని తెలిసింది. ఆ తర్వాతి రోజు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని ఆ పోర్టల్ పేర్కొంది. ఇక 4వ తారీఖున అతిరథ మహారథుల సమక్షంలో ఈ జోడీ పెళ్లి చేసుకోనుంది. అయితే.. ఈ పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులకే ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. జైపూర్ ప్యాలెస్‌లో జరగనున్న ఈ పెళ్లి కోసం.. ఆల్రెడీ గెస్ట్‌ల కోసం గదులు, సూట్‌లు బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్యాలెస్‌లోనే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని వివాహం జరిగింది.
కాగా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించిన హన్సిక, దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. రామ్, ప్రభాస్ సరసన జోడీ కట్టింది. కొన్నాళ్లపాటు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ని కూడా ఏలింది. అయితే.. ఇతర హీరోయిన్ల నుంచి గట్టి పోటీ రావడంతో, క్రమంగా ఆమెకు ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అమ్మడు పెళ్లి చేసుకొని, సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.