ఎదురుగా ఎంతటి మేటి నటులున్నా, దీటైన అభినయంతో జవాబు చెప్పగల దిట్ట గుమ్మడి వెంకటేశ్వరరావు. గుమ్మడి నటించలేరు అంటారు కొందరు. గుమ్మడికి నటనే రాదంటారు మరికొందరు. అయితే అందరూ అంగీకరించే మాట ఏంటంటే – తనకు లభించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమే గుమ్మడికి తెలుసునని. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించారు గుమ్మడి. కథానాయక పాత్రల్లో మినహాయిస్తే, అన్నిటా భేష్ అనిపించుకుంటూ ప్రతీసారి నూటికి నూరు మార్కులూ సంపాదించేవారు. కొండొకచో నూటికిపైగా మార్కులూ ఆయన సొంతమయిన సందర్భాలూ లేకపోలేదు. నాటి మేటి నటీనటులందరికీ ‘తండ్రి’గా నటించి మెప్పించారు. ఆ మాటకొస్తే ఒకానొక సమయంలో తెలుగు సినిమాల్లో నాన్న పాత్రలు అంటే గుమ్మడి చెంతకే పరుగులు తీసేవి. దాదాపు నాలుగు తరాల నటులకు ఆయన తండ్రిగా నటించారు. నాగయ్య తరువాత తెలుగు సినిమా రంగంలో నాన్న
గా పేరొందిన నటులు గుమ్మడి అనే చెప్పాలి.
గుమ్మడి చదువుకొనే రోజుల నుంచీ నాటకాల్లో రాణించారు. మంచి సాహితీప్రియుడు. సుస్పష్టమైన గుమ్మడి వాచకం ఆయనకు ప్రధాన ఆకర్షణ. మిత్రుల ప్రోత్సాహంతో గుమ్మడి చెన్నపట్టణం చేరి, చిత్రసీమలో రాణించే ప్రయత్నం చేశారు. తొలి చిత్రం ‘అదృష్టదీపుడు’ లోనే మంచి పాత్ర లబించినా, కలసి రాలేదు. యన్టీఆర్ సొంత చిత్రాలు ‘పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు’తో మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత కూడా హీరోగా అవకాశాలు వచ్చినా, వాటిలో తాను రాణించలేననే ఉద్దేశంతో స్వచ్ఛందగా తప్పుకున్నారు. తనకంటే వయసులో పెద్దవారయిన యన్టీఆర్, ఏయన్నార్ కే తండ్రిగా, మామగా, తాతగా నటించే పాత్రలను అంగీకరించారు. అప్పటి నుంచీ గుమ్మడికి ఆ తరహా పాత్రలే లభించాయి. చిత్రమేమంటే ఒకే తరహా పాత్రలు లభించినా, జనానికి ఏ మాత్రం మొహం మొత్తకుండా రాణించడంలోనే గుమ్మడి అభినయ ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 500 పై చిలుకు చిత్రాల్లో గుమ్మడి నాయికానాయకులకు తండ్రిగానో, తాతగానో నటించి మెప్పించారు. కేవలం గుణ చిత్ర పాత్రల్లోనే కాదు, కొన్నిసార్లు ప్రతినాయకునిగానూ గుమ్మడి నటన ఆకట్టుకుంది. తేనెపూసిన కత్తి అంటే ఎలా ఉంటుందో గుమ్మడి విలనీ అలా ఉంటుందని పేరు గాంచారు.
యన్టీఆర్ సొంత సంస్థ ఎన్.ఏ.టి. నిర్మించిన తొలి చిత్రాలలో గుమ్మడికి మంచి పాత్రలే లభించాయి. వాటివల్ల మంచి గుర్తింపు దక్కింది. అప్పట్లోనే యన్టీఆర్, గుమ్మడికి ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండాలో బోధించేవారు. రాబడికి తగిన ఖర్చుతోనే సాగాలనీ యన్టీఆర్ చెప్పారు. ఆయన వల్లనే గుమ్మడి తొలిసారి ఆంధ్రాబ్యాంకులో ఖాతా తెరిచానని పదే పదే చెప్పుకొనేవారు. అయితే కొంతమంది కారణంగా యన్టీఆర్, గుమ్మడి మధ్య దూరం పెరిగింది. తన మిత్రునితో విభేదాలు నచ్చని గుమ్మడి తానే స్వయంగా రామారావు వద్దకు వెళ్ళి తమ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకోవడమే కాదు, యన్టీఆర్ లోని భోళాతనం గురించి అందరికీ చెప్పేవారు. ఆ తరువాత నుంచీ వారిద్దరి మధ్య స్నేహబంధం ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా సాగింది.
ఇక ఏయన్నార్ తో గుమ్మడికి సాన్నిహిత్యం ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే, ఇద్దరూ సాత్వికాభినయంలో ఆరితేరినవారు. పైగా గుమ్మడి చెప్పే సాహితీ విశేషాలను అక్కినేని శ్రద్ధగా వినేవారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన అనేక చిత్రాలలో గుమ్మడి ప్రముఖ పాత్రలు పోషించి అలరించారు.
ఆ రోజుల్లో దక్షిణాది నటీనటులకు ముఖ్యంగా తెలుగువారికి ప్రేక్షకుల రివార్డులే అసలైన అవార్డులు అన్న భావన ఉండేది. దాంతో అవార్డుల గురించి మనవాళ్ళు అంతగా పట్టించుకొనేవారు కాదు. అదే తీరున గుమ్మడి కూడా సాగారు. అందువల్ల ఆయన అభినయానికీ తగిన ప్రభుత్వ అవార్డులు లభించలేదనే చెప్పాలి. గుమ్మడి అభినయ పర్వంలో ‘మహామంత్రి తిమ్మరుసు’ మరపురాని అధ్యాయం. ఈ చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం కూడా లభించింది. ఈ చిత్రాన్ని నాటి ప్రధాన మంత్రి నెహ్రూకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. నెహ్రూను సైతం గుమ్మడి నటన ఎంతగానో ఆకట్టుకుంది. గుమ్మడి కీర్తి కిరీటంలో ఎన్నెన్నో కలికితురాళ్ళు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవడాక్టరేట్ అందుకున్నారాయన. గుమ్మడి నటించిన చివరి చిత్రం `జగద్గురు శ్రీ కాశినాయన చరిత్ర’. అందులో కాశినాయన పాత్రను పోషించారు గుమ్మడి. తెలుగువారి మదిలో చెరగని ముద్రవేసిన ఎందరో మహానటుల్లో గుమ్మడి పేరు కూడా చెరిగిపోకుండా ఉంటుందని చెప్పవచ్చు.