Gummadi : మరపురాని గుమ్మడి అభినయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనకు లభించిన ప్రతీపాత్రకూ న్యాయం చేస్తూ నటించిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయన ఏ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినా, అందులో తన జాడ కనిపించకుండా పాత్ర నీడనే చూపించేవారు. మన దేశం గర్వించదగ్గ ‘మెథడ్ ఆర్టిస్ట్స్’లో గుమ్మడికి సైతం ప్రత్యేక స్థానం ఉంది.
గుమ్మడి వెంకటేశ్వరరావు 1927 జూలై 9న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావుకు బాల్యం నుంచీ ఏదో ఒక వైవిధ్యం ప్రదర్శించాలనే తపన ఉండేది. ఎస్.ఎస్.ఎల్.సి. దాకా చదువుకున్న గుమ్మడికి పుచ్చలపల్లి సుందరయ్య ఉపన్యాసాలు భలేగా నచ్చేవి. దాంతో గుమ్మడి కూడా కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటపట్టించుకున్నారు. కాలేజీలో చేరితే చెడిపోతాడని భావించిన గుమ్మడి కన్నవారు ఆయనకు 17 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేశారు. చివరకు ఎలాగోలా హిందూ కళాశాలలో చేరి ఇంటర్ చదివారు. ఇంటర్ పాస్ కాకపోవడంతో వ్యవసాయంలో దింపారు పెద్దలు. వ్యవసాయం చేస్తూనే పుస్తకాలను విపరీతంగా చదివేవారు గుమ్మడి. ఆ సమయంలోనే ఆయన మనసు నటనవైపు మళ్ళింది. మెల్లగా నాటకాలు వేయసాగారు. తరువాత మిత్రుల ప్రోత్సాహంతో మదరాసు చేరి, సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘అదృష్టదీపుడు’ చిత్రంలో తొలిసారి గుమ్మడి తెరపై కనిపించారు.
Also Read
‘అదృష్ట దీపుడు’ తరువాత గుమ్మడి నటించిన చిత్రాలేవీ అంతగా ఆయనకు పేరు సంపాదించి పెట్టలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ స్వస్థలం పోదామని నిర్ణయించిన గుమ్మడికి, యన్టీఆర్ తమ ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన చిత్రాలలో మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. అలా రామారావు సొంత చిత్రాలు – “పిచ్చి పుల్లయ్య, తోడుదొంగలు, జయసింహ” లో గుమ్మడి కీలక పాత్రలు పోషించారు. ఆ తరువాత గుమ్మడి మరి వెనుదిరిగి చూసుకోలేదు. ‘తోడుదొంగలు’లో గుమ్మడి వయసు మీరిన పాత్ర ధరించడం చూసిన పి.పుల్లయ్య తన ‘అర్ధాంగి’ చిత్రంలో ఏయన్నార్, జగ్గయ్యకు తండ్రిగా నటించే పాత్రను ఇచ్చారు. తన కన్నా వయసులో పెద్దవారయిన నటులకు తండ్రిగా నటించడంతో అప్పటి నుంచీ గుమ్మడికి అధికంగా తండ్రి పాత్రలే పలకరించసాగాయి. ఒకే రకం పాత్రలు ధరించినా, వాటిలో తనదైన బాణీ ప్రదర్శించడానికి గుమ్మడి ప్రయత్నించేవారు. గుణచిత్ర నటునిగా గుమ్మడి తిరుగులేని వైభవం చూశారు. ప్రతినాయక పాత్రల్లోనూ తేనె పూసిన కత్తిలా నటించడంలో గుమ్మడి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కడదాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనే తపించారు గుమ్మడి. ఆయన చివరి చిత్రంగా ‘అవధూత కాశినాయన చరిత్ర’ నిలచింది.
అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించిన గుమ్మడికి ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రం ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. ఈ చిత్రం ద్వారా ఆయనకు రాష్ట్రపతి బహుమతి కూడా లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. రాష్ట్రప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో గౌరవించింది. సాత్వికాభినయంలో తనకు తానే సాటి అనిపించుకున్న గుమ్మడి పేరు తలచుకోగానే ఆయన ధరించిన అనేక వైవిధ్యమైన పాత్రలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. అదీ గుమ్మడి అభినయంలోని ప్రత్యేకత! గుమ్మడి తన చివరి రోజుల్లో చిత్రసీమలో తన అనుభవాలను “తీపి జ్ఞాపకాలు – చేదు గుర్తులు’ పేరుతో రాసుకున్నారు. 2010 జనవరి 26న గుమ్మడి తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రసీమ చూసిన మహానటుల్లో గుమ్మడి పేరు శాశ్వతంగా నిలచిపోతుంది. నవతరం ప్రేక్షకులు సైతం గుమ్మడి మెథడ్ యాక్టింగ్ చూసి ముగ్ధులవుతున్నారు
తాజావార్తలు
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..