Guardians Of The Galaxy: మార్వెల్ కామిక్స్ లో ఇప్పటికి రెండు సార్లు అలరించిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ బృందం ముచ్చటగా మూడోసారి మురిపించనుంది. ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ – వాల్యూమ్ 3’ ట్రైలర్ శుక్రవారం విడుదలయింది. తెలుగు వారినీ అలరిస్తూ తెలుగులో రూపొందిన ఈ ట్రైలర్ లో అజ్ఞాతం నుండి గార్డియన్స్ బృందం బయటకు వస్తుంది. మరో గ్యాలక్సీలో అడుగు పెడతారు. అక్కడ జంతువుల రూపాల్లో ఉన్న జీవులు వారికి మోడరన్ కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తాయి.
జేమ్స్ గన్ దర్శకత్వంలో రూపొందిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ- వాల్యూమ్ 1’ 2014లో విడుదలై విజయఢంకా మోగించింది. ఆ తరువాత రెండో వాల్యూమ్ 2017లో జనాన్ని పలకరించింది. ఆ సినిమా సైతం విజయపథంలో పయనించింది. ఇప్పుడు మూడో వాల్యూమ్ 2023 మే 5న విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ వంటి భారతీయ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. క్రిస్ ప్రాట్, జో సల్డానా, డేవ్ బాటిస్టా, కరేన్ జిల్లాన్, విన్ డీజల్ , బ్రాడ్లే కూపర్ తదితరులు నటించిన ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ- వాల్యూమ్ 3’ ట్రైలర్ లో వేరే గ్యాలక్సీలో అడుగు పెట్టగానే అక్కడి వారితో స్నేహం చేయాలనుకుంటాడు హీరో. కానీ, అతని బృందంలోని బుర్రలేని వెధవ అక్కడ పాప ఇచ్చిన బంతితో ఆమెనే కొడతాడు. గొడవ మొదలవుతుంది. తరువాత పరుగో పరుగు. “మేమెప్పుడూ పరుగెడుతూనే ఉండాలి..మా జీవితమంతా అంతే..” అనే డైలాగ్ వినిపిస్తుంది. “పరిగెత్తింది చాలు..” అంటూ తోడేలు ముఖం ఉన్న వ్యక్తి అనడం కొనసాగింపు. “మా దారికి ఎవరెదురొచ్చినా అంతం చేస్తాం..” అంటూ హీరో బృందం సభ్యుడు అనడం ఆసక్తి కలిగిస్తుంది. ఇలా సాగిన ట్రైలర్ ఈ సారి ‘గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ’ ఏం చేయబోతున్నారు అనే ఆత్రుత రేపుతోంది. మరి ఏం జరగబోతోందో తెలియాలంటే మే 5న ఈ సినిమాను చూడాల్సిందే!