ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవుతూ నోటీసులు జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Read also : పిక్స్ : మరదలి పెళ్ళిలో రామ్ చరణ్… యాని మాస్టర్ కు ప్రత్యేక బాధ్యత
దాదాపు వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న కమల్ డిసెంబర్ 4న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, మరో రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్నీ కూడా కమల్ సోషల మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అలా డిశ్చార్జ్ అయ్యారో లేదో ఇలా తాను హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ తమిళ్ 5″లో పాల్గొన్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన కన్పించడం గమనార్హం. కరోనా తగ్గినప్పటికీ కనీసం వారం రోజులు ఎవరినీ కలవకుండా ఉంటే మంచిదన్న విషయం తెలిసిందే. అయితే ఈ అగ్రహీరో ఆ నిబంధనను పక్కన పెట్టి వెంటనే షూటింగ్ లో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా నోటీసులు జారీ చేసింది. కాగా కమల్ కోలుకునే వరకు ఈ షోను సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ చేసింది.