‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను అందుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. అతనితో సినిమా చేయడానికి చాలామంది యంగ్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. కానీ పర్ ఫెక్ట్ ప్రాజెక్ట్ ను సెట్ చేయాలనే ఆలోచనతో వెంకీ కుడుముల నింపాదిగా ముందుకు కదులుతున్నాడు. పలువురు అగ్ర కథానాయకులకు వెంకీ కుడుముల ఇప్పటికే కథలు చెప్పాడట. డేట్స్ లేక కొందరు తర్వాత చూద్దాం అని అంటే, మరి కొందరు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారట. ఇదిలా ఉంటే… ‘భీష్మ’ తర్వాత రామ్ చరణ్ కోసం కూడా ఓ కథను వెంకీ కుడుమల తయారు చేశాడట. అయితే… కొన్ని సిట్టింగ్స్ అయిన తర్వాత చెర్రీ… సున్నితంగా ఆ ప్రాజెక్ట్ చేయలేనని చెప్పేశాడట. దాంతో అదే కథను ఆ తర్వాత వరుణ్ తేజ్ కు వెంకీ చెప్పాడని అంటున్నారు. చెర్రీ నో చెప్పిన కథే వరుణ్ తేజ్ కు బాగా నచ్చేసిందని, అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘గనీ’ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే ఈ మూవీనే పట్టాలెక్కుతుందని అంటున్నారు. మరి తొలిసారి మెగా ఫ్యామిలీ హీరోతో డీల్ కుదుర్చుకున్న వెంకీ కుడుమల రాబోయే రోజుల్లో ఆ ఫ్యామిలీకి చెందిన ఏ యే హీరోతో మూవీస్ చేస్తాడో చూడాలి. ఈ సినిమాలోనే వరుణ్ తేజ్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.