యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ మూవీ దాదాపు పూర్తయిపోయింది. కృష్ణంరాజుకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, కొద్దిగా ప్యాచ్ వర్క్. ఒకే ఒక్క పాట చిత్రీకరించాల్సి ఉంది. కానీ ప్రభాస్ వ్యక్తిగత సిబ్బందికి కారోనా రావడంతో పాటు పూజాహెగ్డే సైతం కొవిడ్ 19 బారిన పడింది. దాంతో అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేశారు. గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగినట్టే… ఇప్పుడు కూడా ప్రభాస్, పూజా హెగ్డే మీద ఉన్న బాలెన్స్ పాటను చిత్రీకరించకుండానే మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేయాలని చిత్ర దర్శక నిర్మాతలు భావించారట.
అయితే… ఈ సినిమాను ఉత్తరాదిన విడుదల చేస్తున్న టీ-సీరిస్ సంస్థ మాత్రం ఆ పాట చిత్రీకరణపై పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఓ సినిమాలో పాటలకు ఉండే ప్రాధాన్యం తెలిసిన టీ-సీరిస్ అంత తేలిగ్గా ఈ పాటను వదులకోవడానికి సిద్ధంగా లేదట. ఎందుకంటే ఇవాళ ఆడియో మాత్రమే కాదు… మూవీలోని సాంగ్ వీడియో సైతం మ్యూజిక్ కంపెనీలకు కోట్ల రూపాయలను వసూలు చేసి పెడుతోంది. ఈ నేపథ్యంలో టీ-సీరిస్ సంస్థ ఒత్తిడి మేరకు యూవీ క్రియేషన్స్ అండ్ గోపీకృష్ణ మూవీస్ చివరకు ఆ పాటను సైతం చిత్రీకరించడానికి అంగీకరించాయట. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన వెంటనే ఈ పాట చిత్రీకరణతో పాటు, బాలెన్స్ ప్యాచ్ వర్క్ సైతం పూర్తి చేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద ‘సాహో’ తర్వాత రాబోతున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’పై ఉత్తరాది నిర్మాతలు చాలా కీన్ గానే ఉన్నారు!!