నాలుగేళ్ళ క్రితం ‘థడక్’ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఆ తర్వాత ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీ’ చిత్రాలలో నటించింది. ఈ రెండు సినిమాలు నటిగా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అలానే ‘ఘోస్ట్ స్టోరీస్’ వెబ్ సీరిస్ లోనూ ఓ ఎపిసోడ్ లో నటించింది. మంచి కథలు ఎక్కడ ఉన్నా వాటిని చేజిక్కించుకోవాలని జాన్వీ కపూర్ తాపత్రయ పడుతోంది. అందులో భాగంగానే ఓ తమిళ రీమేక్ లోనూ, ఓ మలయాళ రీమేక్ లోనూ నటించింది. నయనతార లీడ్ రోల్ చేసిన లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కొలమావు కోకిల’ హిందీ రీమేక్ అందులో ఒకటి.
తమిళ దర్శకుడు నెల్సన్ మొదటి సినిమా ఇది. ఆ తర్వాతే అతను ‘డాక్టర్’, ‘బీస్ట్’ చిత్రాలను చేశాడు. హిందీలో జాన్వీ కపూర్ నటించిన సినిమాకు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే పేరు పెట్టారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో ఆనంద్ ఎల్ రాయ్ దీనిని నిర్మించారు. దీపక్ దోబ్రియల్, మీటా వశిష్ఠ, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అలానే మలయాళ చిత్రం ‘హెలెన్’ హిందీ రీమేక్ లోనూ జాన్వీకపూర్ నటించింది. ‘మిలి’గా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల విశేషాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాను మలయాళంలో రూపొందించిన మత్తుకుట్టి జేవియర్ హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత యేడాది నవంబర్ లోనే పూర్తయిపోయింది.