Drishyam 3: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన గురించి ఆయన ఎంచుకొనే కథల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ అందుకోవడమే కాకుండా వేరే భాషల్లో హీరోలు ఆయన సినిమాలను రీమేక్ చేసేలా చేస్తారు. ఇక మోహన్ లాల్ కెరీర్ హిట్ లిస్ట్ లలో దృశ్యం ఒకటి. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగులో రీమేక్ కూడా అయ్యింది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇక్కడ కూడా అంతే విజయాన్ని అందుకుంది. ఇక దృశ్యం సినిమాకు కొనసాగింపుగా దృశ్యం 2 వచ్చింది. అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. కన్నకూతురును కాపాడుకోవడానికి ఒక తండ్రి చేస్తున్న యుద్ధమే దృశ్యం కథ అని చెప్పొచ్చు.
జార్జి కుట్టి గా మోహన్ లాల్ నటన అద్భుతం. ఇక ఈ రెండు పార్టులకు కంటిన్యూగా దృశ్యం 3 రానుంది. నేడు ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దృశ్యం 3 ది కంక్లూజన్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు జీతూ జోసఫె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ లాల్ చేతికి సంకెళ్లతో సీరియస్ లుక్ లో కనిపించాడు. సెకండ్ పార్ట్ చివరిలో ఈ కథ ఇంకా ముగిసిపోలేదు.. మళ్లీ ఏ రోజైనా పోలీసులు రావొచ్చు.. గతాన్ని తిరిగి తోడొచ్చు. ఎప్పటికైనా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను అంటూ మోహన్ లాల్ చెప్పిన డైలాగ్ తోనే ఈ సినిమాకు ఇంకో పార్ట్ ఉందని హింట్ ఇచ్చేసాడు డైరెక్టర్. ఇక నేడు కన్ఫర్మేషన్ రావడంతో అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రెండు పార్ట్ లో ఉన్నట్లే ఈ పార్ట్ లో కూడా ట్విస్టులు అదిరిపోతాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూడో పార్ట్ ఎలాంటి విజయాన్ని అందుకొంటుందో చూడాలి.