అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నిర్మాతలు మాట్లాడుతూ, ”గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. లవ్, కామెడీ, యాక్షన్… ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దర్శకుడు చెప్పిన దానికంటే కూడా అద్భుతంగా చిత్రీకరించాడు. మా సంస్థలో వస్తోన్న తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాం” అని అన్నారు.
హీరో అభిజిత్ రామ్ మాట్లాడుతూ, ”రేడియో మిర్చిలో ఆర్జే గా పని చేశాను. మా నిర్మాతలు, దర్శకుడు ఒక మంచి కథతో సంప్రదించారు. కథ నచ్చడంతో వెంటనే అంగీకరించాను. శ్రీకాకుళం, పలాస, ఉద్దానం, వైజాగ్, ఒరిస్సా , హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. టీమ్ అంతా ఎంతో ప్యాషనేట్ గా పని చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది” అని అన్నారు. దర్శకుడు కిరణ్ తిమ్మల మాట్లాడుతూ… ”టీవీ ఛానల్లో నేను రిపోర్టర్ గా జర్నీ ప్రారంభించాను. దర్శకుడు అవ్వాలన్నది నా లక్ష్యం దాంతో ఒక మంచి కథ రెడీ చేసుకుని మా నిర్మాతలకు చెప్పాను. కథ వారికి నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది“ అన్నారు.