Chiranjeevi: దసరా పండుగ.. అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. మొట్ట మొదటిసారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక తమ అభిమాన హీరోను ఒక్కసారిగా ఎదురుగా చూసే సరికి అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు. ఈ జ్ఞాపకాన్ని పదిలపర్చుకోవడం కోసం ఆయనతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఆయన కూడా పెద్ద మనస్సుతో వారి అభిమానాన్ని కాదనడం ఎందుకని ఫోటోలు దిగుతూ వచ్చారు. అయితే ఇదంతా ఒక పక్క.. ఇంకోపక్క ప్రముఖ బ్రాహ్మణోత్తముడు గరికపాటి నరసింహారావు ప్రవచన వాక్యాలు చెప్తూ ఉన్నారు. అయితే చిరు అలా ఫోటోలు దిగుతూ ఉంటే తన ప్రవచన కార్యక్రమం సాగేలా లేదు అనుకున్నారో ఏమో.. ఆయనపై కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ” చిరంజీవి ఫోటో సెషన్ ఆపితేనే నేను కార్యక్రమం మొదలుపెడతాను.. లేకపోతే నిర్మొహమాటంగా వెళ్ళిపోతాను. చిరంజీవి ఇటు రావాలి.. లేకపోతే నేను వెళ్ళిపోతాను”అంటూ కోపంతో ఊగిపోయారు. ఇక ఆయన మాటలు నెట్టింట ఎంతటి సంచలనం క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గరికపాటి అలా మాట్లాడడం పద్దతికాదని మెగా అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా చెప్పుకొస్తున్నారు.
ఒక బ్రాహ్మణోత్తముడు, కోపం గురించి, అసూయా గురించి ప్రవచనాలు చెప్పే వ్యక్తి అయ్యిఉండి కూడా చిరు విషయంలో అంత కోపం, అసూయ పడడం ఏంటి..? ఇదేనా ఆయన ప్రవచనాలు చెప్పడం వలన నేర్చుకున్నది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక చిరు కూడా పెద్దవారు పిలిచారు అని మారుమాట్లాడకుండా వచ్చి తాను చేసిన దానికి సారీ చెప్పి వినయంగా ఆయన పక్కన కూర్చున్నారు. ఇక ఆయనకున్న విజ్ఞత గరికపాటికి లేదా అని నెటిజన్లు మండిపడుతున్నారు. నిన్నటి నుంచి ఈ చర్చ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ గరికపాటిని ఏకిపారేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం గరికపాటి తన తప్పు తెలుసుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్, గరికపాటికి కాల్ చేసి ఇది పద్ధతేనా అని కొంచెం ఘాటుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ దాటికి తట్టుకోలేమని తెలుసుకున్న గరికపాటి చిరుకు సారీ చెప్తానని చెప్పినట్లు సమాచారం. ఆయనను స్వయంగా కలిసి ఈ విషయంలో క్షమాపణలు చెప్పనున్నారట. మరి ఇదే కనుక జరిగితే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లే.