కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారతీయ సినిమా రంగంలో థియేట్రికల్ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్న ఏకైక సినిమా పరిశ్రమ టాలీవుడ్. థియేటర్లు తిరిగి తెరిచినప్పటి నుండి ఎన్నో చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. నెమ్మదిగా ప్రేక్షకులు కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ప్రతి వారం 5 సినిమాలకు తక్కువ కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. రానురానూ చిన్న సినిమాలతో పాటుగా మీడియం బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం (ఆగష్టు 27న) కూడా ఐదు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
శ్రీదేవి సోడా సెంటర్
రేపు తెరపైకి రానున్న, బాగా అంచనాలు ఉన్న ముఖ్యమైన రెండు సినిమాల్లో “శ్రీదేవి సోడా సెంటర్” ఒకటి. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆనంది హీరోయిన్ పాత్ర పోషించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా బలమైన సామాజిక-రాజకీయ అంశాలతో కూడి ఉంటుంది. అయితే ఈ సినిమాకు ప్రభాస్, మహేష్ వంటి స్టార్ హీరోలు సపోర్ట్ చేయడంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది.
ఇచ్చట వాహనములు నిలుపరాదు
“అల వైకుంఠపురములో” తర్వాత సుశాంత్ నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ ఇది. ఎస్. దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. “శ్రీదేవి సోడా సెంటర్” తరువాత “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాపైనే మంచి అంచనాలు ఉన్నాయి.
హౌస్ అరెస్ట్
“90ఎంఎల్” డైరెక్టర్ శేఖర్ రెడ్డి యెర్రా ఈరోజు “హౌస్ అరెస్ట్” అనే కామెడీ క్యాపర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి ఇందులో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పిల్లలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సరదా సరదాగా సాగుతుందని భావిస్తున్నారు.
సూర్యస్తమయం
ముక్కుసూటి ఇంటర్వ్యూలకు పేరు గాంచిన దర్శకుడు బండి సరోజ్ కుమార్ రూపొందించిన చిత్రం “సూర్యాస్తమయం”. సినిమా విజయంపై దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నాడు. రెండు దశాబ్దాల పాటు ప్రజలు ఈ సినిమాను గుర్తుంచుకుంటారని హామీ ఇచ్చారు. అయితే సినిమా విడుదలవుతుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. సరైన ప్రమోషన్ జరగలేదు.
గ్రేట్ శంకర్
ఇది 2017 మలయాళ చిత్రం “మాస్టర్ పీస్”కు తెలుగు డబ్బింగ్ వెర్షన్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మమ్ముట్టి, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థియేటర్లలో ఒకేరోజు 5 సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి ఇందులో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.